అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!

20 Jan, 2024 17:51 IST|Sakshi

యూజ్ అండ్ త్రో పాలసీకి పేటెంట్‌దారుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. జిల్లా ఏదైనా.. నియోజకవర్గం ఏదైనా డబ్బు సంచులు తెచ్చేవారికే టిక్కెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే వ్యవహారం చిత్తూరు నియోజకవర్గంలో కాక రేపుతోంది. కష్టకాలంలో పార్టీకోసం పనిచేసినవారిని కాదని.. డబ్బులిస్తారని ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే సహించేది లేదని అక్కడి నేతలు తేల్చి చెబుతున్నారు. కొత్తవారికి ఇస్తే మరోసారి ఓటమి ఖాయమని అధినేతకు తెగేసి చెప్పేస్తున్నారు. అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం.

చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టిడిపిలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక పార్టీ క్యాడర్ ఆందోళనకు గురవుతోంది. స్థానిక నేతలకు బదులుగా వేరే నియోజకవర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం యోచిస్తుండడం టిడిపి శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా చిత్తూరులో టిడిపి వ్యవహారాలను కాజూరు బాలాజీ చూస్తున్నారు. తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయనే టాక్ నడుస్తోంది.

బాలాజీ స్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని మొదట టిడిపి అధిష్టాన వర్గం పరిశీలించిందట. అయితే ఇప్పుడు కొత్తగా టీఎన్ రాజన్ అనే వ్యక్తి తెరపైకి వచ్చాడు. గురజాల జగన్మోహన్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు.

కొద్ది నెలలుగా చిత్తూరులో పర్యటిస్తూ అసెంబ్లీ టిక్కెట్ తనకే వస్తుందని అనుచర గణం వద్ద చెప్పుకుంటున్నారట. అలాగే తిరుచానూరుకు చెందిన మాజీ సర్పంచ్ టిఎన్ రాజన్ రెండు మూడు వారాలుగా చిత్తూరుకు వచ్చి తనకే టికెట్ వస్తుందని తన సామాజిక వర్గం వద్ద గట్టిగా చెబుతున్నాడట.

చిత్తూరు అభ్యర్థిగా రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో టీడీపీ కేడర్‌లో అయోమయం ఏర్పడింది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటివరకు చిత్తూరు విషయంలో క్లారిటీ ఇవ్వడంలేదు..ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టడంలేదట. దీంతో ఎవరికి వారే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది.

టీడీపీ అగ్ర నాయకత్వమే అభ్యర్థి విషయంలో గందరగోళానికి తావిస్తోందని, ఎలాగూ ఓడిపోయే సీటే గనుక పార్టీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవడంలేదేమో అని కూడా కార్యకర్తలు సందేహిస్తున్నారు. టికెట్ విషయంలో ఎవరో ఒకరు తేల్చుకున్న తర్వాత చూద్దాంలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చదవండి:    టీడీపీతో పొత్తు కోసం ఆ నలుగురు నేతలు పాట్లు..!

whatsapp channel

మరిన్ని వార్తలు