మున్సిపోల్స్‌తో మునిగిపోతాం!

14 Mar, 2021 03:44 IST|Sakshi

తెలుగుదేశం పార్టీలో టెన్షన్‌ టెన్షన్‌

పంచాయతీ ఎన్నికల్లాగే ఈ ఫలితాలుంటాయని అంతర్గత విశ్లేషణలు 

నాలుగైదు మున్సిపాలిటీల్లో కూడా గెలవడం కష్టమేనంటున్న నేతలు

దీంతో పైకి మాత్రమే గెలుస్తామని డాంబికాలు 

సాక్షి, అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదనే అంచనాలతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల తీర్పే అర్బన్‌ ప్రాంతాల్లోనూ ప్రతిఫలిస్తుందనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అంతర్గతంగా పార్టీ నేతలు చేసుకునే విశ్లేషణల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే పూర్తి అనుకూల వాతావరణం ఉన్నట్లు వారే చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవులను వైఎస్సార్‌సీపీ అభిమానులు చేజిక్కించుకోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేతలు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే టీడీపీ బోల్తా పడడంతో స్థానిక ఎన్నికలపై ఆ పార్టీ నేతలు ఆశలు వదిలేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కూడా 80 శాతానికిపైగా పంచాయతీలను ఆ పార్టీ కోల్పోవడంతో ప్రజల్లో వైఎస్సార్‌సీపీకి ఉన్న ఆదరణ ఏ మాత్రం తగ్గకపోగా, మరింత పెరిగిందనే విషయం స్పష్టమైందని టీడీపీ నాయకులు అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటున్నారు. 

ప్రజల్ని రెచ్చగొట్టినా పట్టించుకోలేదు..
క్షేత్ర స్థాయిలో పరిస్థితి తమ పార్టీకి అనుకూలంగా లేదని పంచాయతీ ఫలితాలు రుజువు చేసినా ప్రచారం కోసం చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ హడావుడి చేయడంతో పార్టీ శ్రేణులు అయిష్టంగానే పోటీకి దిగాయి. చాలా చోట్ల అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉన్నా చంద్రబాబు ఎలాగైనా నామినేషన్లు వేయించాలని ఒత్తిడి చేయడంతో అనేక మంది నేతలు బలవంతంగా పలువురిని పోటీకి దింపారు. నామినేషన్లు వేశాక ఇక తమ పని అయిపోయిందన్నట్లు పార్టీ ముఖ్య నేతలు వ్యవహరించడంతో కింది స్థాయిలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బందులు పడ్డారు.

అధిష్టానం మీడియాలో ప్రకటనలు, ఎస్‌ఈసీకి లేఖలు రాయడం వంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థుల గురించి పట్టించుకోకపోవడంతో కింది స్థాయిలో ఆందోళన నెలకొంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దాదాపు అన్ని వర్గాలకు మేలు జరగడం, సీఎం వైఎస్‌ జగన్‌పై ఉన్న ఆదరణ చెక్కు చెదరక పోవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చంద్రబాబు సహనం కోల్పోయి అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు నగరాల్లో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ నేతల ఆశలు నీరుగారి పోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. 

ప్రధాన కార్పొరేషన్లలోనూ ఛాన్స్‌ లేదా?
మున్సిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయనే నమ్మకం టీడీపీ నేతల్లో ఏమాత్రం కనిపించడం లేదు. టీడీపీ బలంగా ఉందని భావించే విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లలోనూ తమకు అవకాశం లేదని గుంటూరుకు చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు తెలిపారు. పార్టీ చేయించిన సర్వేల్లో కూడా ఒక్క కార్పొరేషన్‌ అయినా వస్తుందో లేదో అనేలా పరిస్థితి ఉందన్నారు. ఇక మున్సిపాలిటీల్లో నాలుగైదు రావడం కూడా కష్టమని తమ సర్వేల్లోనే వెల్లడైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పోలింగ్‌ తర్వాత టీడీపీ నాయకులు ఎవరిలోనూ ధీమా కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైకి మాత్రం మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తామే గెలుస్తామని మీడియాలో ప్రకటించుకోవడమే తప్ప ఎవరికీ ఆ నమ్మకం లేదంటున్నారు.  

మరిన్ని వార్తలు