వలస వచ్చి మామీద పెత్తనమా.. ఎచ్చర్లలో ఎల్లో ఫైట్!

28 Sep, 2022 16:19 IST|Sakshi

 కళాకు, స్థానిక నేతలకు మధ్య పొసగని పరిస్థితి 

మూడోసారి ఎచ్చర్ల నుంచి పోటీకి కళా తహతహ

కొత్త టీమ్‌ను తయారు చేసుకునే పనిలో కళా వెంకటరావు

వలస నేత పెత్తనం ఇంకా ఎన్నాళ్లంటున్న స్థానిక నేతలు 

ఆయనో సీనియర్‌ నేత. మాజీ మంత్రి.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పనిచేశారు. ఇదంతా గతం. ఇప్పుడు సీన్‌ మారింది. మీరొద్దు, మీ పెత్తనం వద్దంటూ అంతా సైడ్‌ అయిపోతున్నారు. అయినా ఆయన మాత్రం మళ్లీ తనకే టికెట్‌ కావాలంటూ తనదైన శైలిలో పావులు కదుపుతుండడం పచ్చ పార్టీలో చిచ్చు రేపుతోంది. 

కిమిడి కళా వెంకటరావు వ్యవహారశైలి ఎప్పుడూ వివాదస్పదమే. సూపర్ సీనియర్ జాబితాలో నెట్టుకొస్తున్నారు తప్పితే క్షేత్ర స్థాయిలో కేడర్‌తో నిత్యం వివాదాలే. 2009లో రాజాం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఎచ్చర్ల నియోజకవర్గానికి కళా వెంకటరావు వలస వెళ్లారు. ఆ ఎన్నికలో పీఆర్పీ తరఫున పోటీచేసి పరాజయం  పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో మరోసారి పోటీచేసి విజయం సాధించారు. అయితే వలస నేత కావడంతో.. ఆయనకు, స్థానిక నేతలకు ఏ దశలో పొసగలేదు. ఫలితంగా 2019లో ఘోర ఓటమి చవిచూశారు. 2024లో ముచ్చటగా మూడోసారి ఎచ్చర్ల నుంచి పోటీకి తహతహలాడుతున్నా.. చెప్పుకోదగ్గ నేతలెవరూ ఆయన వెంట లేకపోవడం చర్చనీయాంశమైంది.  

ఎచ్చర్ల మండలంలో జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, జి.సిగడాం మాజీ ఎంపీపీ బొమ్మన వెంకటేశ్వరరావు, లావేరు మండంలో అలపాన సూర్యనారాయణ, రణస్థలం మండలంలో కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకపోవడం విభేదాలను తేటతెల్లం చేస్తోంది. దాంతో కొత్త టీమ్‌ను తయారు చేసుకునేందుకు కళా వెంకటరావు శ్రమిస్తున్నా ఓ స్థాయి నేతలు వెంట రావడానికి ఆసక్తి చూపడం లేదట. దాంతో ఎవరికి తెలియని నేతలు ఇప్పుడు ఆయన వెంట దర్శనమిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్‌ సాధించాలనే పట్టుదలతో కళా ఉన్నా.. వ్యతిరేక వర్గీయులు ఆయన్ను లైట్‌ తీసుకుటుండడం కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. 

కళాను వ్యతిరేకిస్తున్న నేతలంతా ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చి పెత్తనం చేయాలనుకుంటే కుదరదని, వలస నేత పెత్తనం ఇంకా ఎంత కాలమని కొందరు నేతలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరికొందరు కళా వెంకటరావు పనైపోయింది.. ఆయనకు టికెట్‌ ఇచ్చే పరిస్థితి లేదని బహిరంగానే ప్రకటిస్తున్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మాజీ మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను కాదని, వేరే వారికి చంద్రబాబు టికెట్‌ ఇచ్చే అవకాశమే లేదని ఆయన అంటున్నారట. అయితే క్యాడర్‌ మాత్రం ఈసారి కళాను పక్కన పెట్టాల్సిందేనని డిమాండ్‌ చేస్తుండడం స్థానిక టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు