కుప్పకూలిన చంద్రబాబు సామ్రాజ్యం

22 Feb, 2021 14:57 IST|Sakshi

కుప్పంలో దారుణ పరాజయంపై టీడీపీ నాయకులు, శ్రేణుల్లో నైరాశ్యం

దౌర్జన్యాల వల్లే ఓడామంటూ బాబు మేకపోతు గాంభీర్యం

త్వరలో కుప్పం పర్యటనకు ఏర్పాట్లు 

సాక్షి, తిరుపతి : మూడు దశాబ్దాలకుపైగా తమకు ఆయువు పట్టు లాంటి కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపొందడం టీడీపీని తీవ్ర నిర్వేదానికి గురిచేసింది. తమ అధినేత నియోజకవర్గంలోనే ప్రజలు పార్టీని తిరస్కరించడం, దారుణంగా పరాజయం పాలవడంతో టీడీపీ నాయకులు, శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. కుప్పంలో 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 75 చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు విజయం సాధించడం, 14 చోట్ల మాత్రమే టీడీపీ అభిమానులు నెగ్గడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. 2013 పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు 14, టీడీపీ అనుకూలురు 75 స్థానాల్లో విజయం సాధించగా ఏడేళ్లలో సీన్‌ రివర్స్‌ కావడం గమనార్హం. దీంతో మూడు దశాబ్దాల చంద్రబాబు నాయుడు సామ్రాజ్యం కుప్పకూలింది.

భ్రమలు బట్టబయలు..
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల మెజారిటీలను లెక్కగడితే కుప్పంలో 30 వేల ఓట్ల తేడాతో టీడీపీ పరాజయం పాలైనట్లు వెల్లడైంది. 1989 ఎన్నికల నుంచి చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మెజారిటీ 17 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఏకంగా 30 వేల ఓట్ల తేడా రావడంతో సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు ఆదరణ కోల్పోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ పుంజుకుంటున్నట్లు బాబు భ్రమలు కల్పించేందుకు శతవిధాల ప్రయత్నించినా అసలు బండారం ఈ ఎన్నికలతో బయట పడిందనే చర్చ సాగుతోంది. ప్రజా తీర్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ దౌర్జన్యాల వల్లే ఓడామని ప్రజలను నమ్మించేందుకు బాబు తంటాలు పడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

సత్తా చాటిన వైఎస్సార్‌ సీపీ
2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి 55 వేల పైచిలుకు ఓట్లు సాధించి పార్టీ సత్తా చాటారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళికి 69 వేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు సుమారు 70 వేల ఓట్లు సాధిస్తే టీడీపీ మద్దతుదారులు కేవలం 36,113 ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి నిత్యం టెలీ కాన్ఫరెన్స్‌లు, జూమ్‌ మీటింగ్‌లు నిర్వహించడం వల్లే ఆ మాత్రం ఓట్లు దక్కాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 ఓటమి నాది కాదంటూ సమీక్షలు..
కుప్పంలో ఓటమి తనది కాదని, ప్రజాస్వామ్యం ఓడిందని బుకాయిస్తూనే రెండు రోజులుగా కుప్పం నేతలతో చంద్రబాబు వరుసగా టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఏం జరిగిందో చెప్పాలని కోరుతున్నారు. ధైర్యంగా ఉండాలంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా తాజా ఫలితాలు ఆయన్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రామకుప్పంలో 20 పంచాయతీలు కోల్పోవడం ఆయనకు నిద్రపట్టనివ్వడం లేదని పేర్కొంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే తాను కుప్పం చేరుకుని రెండు మూడు రోజులు అక్కడే ఉంటానని చెప్పినట్లు సమాచారం. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు