మళ్లీ వస్తున్నాడు.. దొంగ హామీల ‘బాబా’.. బాబ్బాబు నమ్మండి ‘బాబు’

21 May, 2023 04:28 IST|Sakshi

టీడీపీ మేనిఫెస్టో హంగామా 

జనాన్ని వంచించే హామీలతో వస్తున్న చంద్రబాబు 

ప్రతి గ్రామం నుంచి అభిప్రాయ సేకరణ పేరుతో డ్రామాలు 

రాజమండ్రి మహానాడులో మేనిఫెస్టో ట్రైలర్‌ విడుదలకు సన్నాహాలు 

తనని నమ్మని ప్రజలను ఎలాగోలా నమ్మించడమే లక్ష్యం 

గతంలోనూ అధికారం కోసం తప్పుడు హామీలతో ప్రజల్ని వంచించిన బాబు 

2014లో 600కి పైగా హామీలు 

అధికారంలోకి వచ్చాక టీడీపీ వెబ్‌సైట్‌ నుంచే తొలగింపు.. 

హామీలపై చేతులెత్తేసి ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్న టీడీపీ   

సాక్షి, అమరావతి: ఏవేవో హామీ­లతో ప్రజలను బుట్టలో వేసుకొని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే  ప్రజలను వంచించడంలో సిద్ధ­హస్తుడుగా పేరొందిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరో­సారి దొంగ హామీలతో మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆర్థి కంగా పైకి తీసుకొస్తా, టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తా, ఆంధ్రప్రదేశ్‌ తలరాతను మార్చేస్తా అంటూ ఇప్పటికే రకరకాల మాయ మాటలు చెబుతున్న ఆయన.. మరో­సారి ఎన్నికల మేని­ఫెస్టో పేరుతో వంచనకు సిద్ధమవుతున్నారు.

అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా మేనిఫెస్టో తయారు చేసే పేరుతో గ్రామ స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ అనే డ్రామాకు తెరలేపారు.  యువకులు, మహిళలు, నిరుద్యోగుల వంటి వర్గాలను బుట్టలో వేసుకోవాలంటే ఏమేమి హామీలు ఇవ్వాలంటూ మండల, జిల్లా స్థాయి వరకు అభిప్రాయాలు సేకరిస్తు­న్నారు. ప్రజలను మాయ చేసే మేని­ఫెస్టో కోసం ప్రత్యేకంగా వ్యూహకర్తల బృందాన్ని కూడా నియమించి, వారితో అధ్యయనాలు చేయిస్తున్నారు.

వీటిన్నింటినీ క్రోడీకరించి, ఈ నెల 27న రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడులో ట్రైలర్‌ (శాంపిల్‌) మేనిఫెస్టోను విడుదల చేస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నా­యి. ఆ తర్వాత మరి­న్ని వంచన­లతో పూర్తి­స్థాయి మేని­ఫెస్టో రూ­పొం­­దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

నమ్మకానికి, చంద్రబాబుకు అస్సలే పడదు 
ఈ ఎన్నికల మేనిఫెస్టోపై చంద్రబాబు చాలా రోజుల నుంచే పనిచేస్తున్నారు. మేనిఫెస్టో, అందులో హామీలు ఎలా ఉంటే ప్రజలు తనను నమ్మడానికి అవకాశం ఉంటుందో అధ్య­యనం చేస్తున్నారు. ఎందుకంటే.. నమ్మ­కానికి, చంద్రబాబుకు అస్సలు పడదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఏదైనా ఒక మాట చెబితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసే నేతగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో పేరుండగా.. చంద్రబాబుపై మాత్రం అందుకు విరుద్ధమైన అభిప్రాయం ఉంది.

చంద్రబాబు ఏ మాట చెప్పినా అది రాజకీయం కోసమే తప్ప ఆచరణలోకి తీసుకురారనే నమ్మకం ప్రజల్లో బల­ంగా నాటుకుపోయింది. అధికారం కోసం తప్పుడు హామీలతో ప్రజల్ని వంచించిన చరిత్ర ఆయనది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ వంటి అనేక హామీలే ఇందుకు ప్రబల నిదర్శనం. రాష్ట్రంలోని రైతులందరి రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత దానికి సవాలక్ష కొర్రీలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టారు.

అదే విధంగా డ్రాక్రా మహిళలనూ వంచించారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను నమ్మి­ంచి, ఎన్నికల ఏడాది వరకు దాని గురించి పట్టించుకోలేదు. ఎన్నికలు 6 నెలలు ఉన్నా­యనగా దాన్ని తూతూమంత్రంగా అమలు చేసి నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ప్ర­యత్నించారు. ఇంటికో ఉద్యోగం, బాబొ­స్తేనే జాబు వంటి ఎన్నో హామీలు బుట్టదాఖలయ్యాయి. 2014 ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు 600కి పైగా హామీలతో చంద్రబాబు ఒక పుస్తకాన్నే విడుదల చేశారు.

అందులో పది శాతం కూడా అమలు చేయలేదు. ప్రతిపక్షాలు, ప్రజలు వాటి గురించి అడుగుతుండడంతో సమాధానం చెప్పలేక చేతులెత్తేసి తోకముడిచేశారు. చివరికి తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌ నుంచి ఆ మేనిఫెస్టోనే తొలగించేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును చీదరించుకుని చిత్తుగా ఓడించారు. 

ప్రజలను ఎలాగైనా నమ్మించడమే లక్ష్యం
గత ఎన్నికల్లో తనని తిరస్కరించిన ప్రజలను ఎలాగైనా నమ్మించడానికి చంద్రబాబు మాయోపాయం పన్నుతున్నారు. ప్రజలను ఏమార్చే హామీలపై అధ్య­యన బృందాలు, వ్యూ­హ­కర్తలతో కలిసి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే మహా­నాడులో శాంపిల్‌ మేనిఫెస్టోను ప్రజ­ల్లోకి వదిలేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ఆయన ఇప్పటికే ప్రజలకు నమ్మబలుకుతున్నారు.

గ్రామ సచివాలయ వ్యవ­స్థపైనా నర్మగర్భంగా ప్రకటనలు చేస్తూ దాన్ని కొనసాగిస్తాననే సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి పలు ప్రకటనల ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ముమ్మ­రం చేసే క్రమంలోనే మేనిఫెస్టో రాజకీయానికి తెరలే­పారు. చంద్రబాబు మాయ మాటలు, దొంగ హామీలను ప్రజలు నమ్ముతారా అనే ప్రశ్నకు టీడీపీ నాయకులే నీళ్లు నములుతున్నారు. 

మరిన్ని వార్తలు