మోగని ‘గంటా’ రాజీ‘డ్రామా’

8 Feb, 2021 08:45 IST|Sakshi

స్పీకర్‌ ఫార్మాట్‌లో లేని ఉత్తుత్తి లేఖతో హడావుడి

ఊహించని విధంగా విమర్శల పర్వం

వామపక్షాలు మినహా ఎవ్వరూ స్వాగతించని వైనం

’’ఇల్లు కాలి ఒకాయన బాధ పడుతుంటే చుట్ట కాల్చడానికి నిప్పు అడిగాడట ఓ ప్రబుద్ధుడు.. ’’.. మోటు సామెతను కాస్త నీటుగా చెప్పామనుకోండి.. అది వేరే విషయం.. అయితే సరిగ్గా ఈ సామెత మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వందశాతం వర్తిస్తుంది. ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ గత ఎన్నికల్లో ’ఉత్త’ర కుమారుడిగా ప్రయాస పడి ఎట్టకేలకు స్వల్ప ఓట్లతో బయటపడ్డ గంటా..  నాటి నుంచి ఇంటి గుమ్మం దాటి బయటకు రావడం లేదు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తాను ఎమ్మెల్యేగా గెలిచిన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత 20 నెలలుగా ఎక్కడా పర్యటించలేదు. నియోజకవర్గ సమస్యలపై ఏనాడూ స్పందించలేదు. అసెంబ్లీకి సైతం మొక్కుబడిగా హాజరు వేయించుకుని వస్తున్నారు. ఇక తెలుగుదేశం పారీ్టపై గెలిచిన సదరు గంటా... ఎన్నికల తర్వాత ఒక్కసారి కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్లలేదు. పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొన్న దాఖలాల్లేవు. ఆ పార్టీ సంగతి వదిలేస్తే కనీసం బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ఈ 20 నెలల కాలంలో ఒక్కసారి కూడా వ్యవహరించలేదు. అడపాదడపా పార్టీ మార్పు అంటూ అనుకూల మీడియాల్లో వార్తలు వేయించుకోవడం తప్పించి ఎక్కడా ’గంట’ మోగింది లేదు. (చదవండి: టీడీపీ డీలా: బరిలో దిగే వారేరీ..?)

సరిగ్గా ఈ నేపథ్యంలోనే స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం రావడంతో ఇదే వేదికగా హడావుడి చేయాలని గంటా భావించినట్టున్నారు. అంతే.. చిత్తం వచ్చిన భాషలో ఓ లేఖ రాసి మీడియాకు వదిలేశారు. తాను శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి మొత్తం ఉక్కు ఉద్యమాన్ని తానే ముందుండి నడిపిస్తానని భీకర ప్రతిజ్ఞ కూడా చేసేశారు. కానీ స్పీకర్‌ ఫార్మాట్‌కు విరుద్ధంగా వదలిన ఆ రాజీనామా లేఖతోనే గంటా వ్యూహాత్మక ప్రచార ఎత్తుగడ బట్టబయలైంది. ఇరవై నెలలుగా గడప దాటి బయట రాని ఆయన ఇప్పుడు ఉక్కు ఉద్యమ ముసుగులో మళ్లీ జనానికి మొహం చూపించాలనే ఆరాటం తప్పించి... నిజమైన పోరాటానికి కాదని ఆ లేఖతో అర్ధమైంది. అందుకే ఆయనపై విమర్శల జడి మొదలైంది.(చదవండి: డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు

లైట్‌ తీసుకున్న విశాఖ నేతలు..
ఓ సారి ఎంపీగా చేసి.. నాలుగో దఫా ఎమ్మెల్యేగిరీ వెలగబెడుతున్న గంటాకు కనీసం శాసన సభ్యత్వానికి ఎలా రాజీనామా చేయాలో కూడా తెలియలేదంటూ అన్ని పక్షాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో కాకుండా తన లెటర్‌ హెడ్‌పై ఏదో నాలుగు ముక్కలు గీకి పారేసి.. అదే రాజీనామా అంటూ ప్రచారపర్వంలో మునిగిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్రమంలోనే వామపక్ష నేతలు మిన హా మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నాయకులూ గంటా రాజీనామాను చాలా ’లైట్‌’ తీసుకున్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభాపక్ష మాజీ నేత విష్ణుకుమార్‌ రాజు. జనసేన నేతలతో పాటు దళిత సంఘాల నేతలు ఆ రాజీ నామాను ఓ ప్రసహనంగా పేర్కొని గంటా వ్యవహారశైలిని ఎండగడుతున్నారు. ఇక టీడీపీలో కొనసాగుతూ... ఆ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ అధినేత చంద్రబాబుకు కనీసమాత్రంగా చెప్పకుండా రాజీనామా చేశానంటున్న గంటా నిర్వాకంతో నగరంలోని మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు. 

గంటా రాజీనామా హాస్యాస్పదం 
పదవి లేకుండా బతకలేని మనిషి గంటా... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు పదవి ఉండాలి. రాష్ట్రంలో జరుగుతున్న చాలా పోరాటాలపై నోరు మెదపని గంటా స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారంటే వ్యక్తిగత స్వార్ధమే ఎక్కువ ఉంటుంది. స్పీకర్‌ ఫార్మాట్‌లో కాకుండా రాజీనామా చేయడం హాస్యాస్పదం
– కొత్తపల్లి వెంకటరమణ, విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక కో–కన్వీనర్‌ 

>
మరిన్ని వార్తలు