పేట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు..

11 Feb, 2021 07:56 IST|Sakshi

పెద్ద కౌకుంట్లలో పేట్రేగిన పయ్యావుల అనుచరులు

పోటీ నుంచి తప్పుకోవాలని అభ్యర్థులకు హెచ్చరికలు

కిడ్నాప్‌ చేసి కడతేరుస్తామంటూ బెదిరింపులు

ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

మేజర్‌ పంచాయతీలో ఆధిపత్య పోరు.. 
పెద్ద కౌకుంట్ల మేజర్‌ పంచాయతీలో దశాబ్దాలుగా టీడీపీ ఆధిపత్య పోరు సాగిస్తోంది. 14 వార్డులున్న పెద్ద కౌకుంట్ల పంచాయతీలో చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాచేపల్లి గ్రామాలు మజారా గ్రామాలుగా ఉన్నాయి. ఎప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా.. ఏకపక్షంగా టీడీపీ వారే అన్ని స్థానాలు దక్కించుకునే వారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల పట్ల పలువురు ఆకర్షితులై.. ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఆధిపత్యానికి చెక్‌ పెట్టాలని భావించారు. ఇందులో భాగంగా 14 వార్డులకు గాను 10 వార్డుల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన నాలుగు వార్డుల్లో ప్రత్యర్థి అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చివరి నిమిషంలో టీడీపీ నాయకుల కుట్రలు భగ్నం చేస్తూ ఈ నాలుగు వార్డుల్లోనూ పోటీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

విత్‌డ్రాలకు నేటితో ఆఖరు.. 
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు విత్‌డ్రా చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. ఈ నెల 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కుట్ర రాజకీయాలకు టీడీపీ తెరలేపింది. ప్రత్యర్థి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని విత్‌డ్రా చేసుకోవాలని, లేకుంటే కిడ్నాప్‌ చేసి, అంతు చూస్తామంటూ ప్రత్యక్ష బెదిరింపులకు దిగారు.

మాట వినకపోతే...  
పెద్ద కౌకుంట్ల పంచాయతీ 11వ వార్డు అభ్యర్థిగా రాచేపల్లి గ్రామానికి చెందిన పెన్నోబులేసు నామినేషన్‌ వేశాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు శంకరయ్య, వేలూరి నారాయణస్వామి (పయ్యావుల అనుచరులు) బుధవారం ఉదయం పెన్నోబులేసు ఇంటికి వెళ్లి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. దీనిపై అభ్యర్థి కుటుంబసభ్యులు నిరాకరించడంతో రెచ్చిపోయిన వారు.. ‘మా మాట వినకపోతే నీ కొడుకును కిడ్నాప్‌ చేసి అంతు చూస్తాం’ అంటూ పెన్నోబిలేసు తల్లిదండ్రులను బెదిరించారు. ఘటనతో భయభ్రాంతులకు గురైన పెన్నోబిలేసు కుటుంబసభ్యులు.. తమకు శంకరయ్య, నారాయణస్వామి నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
(చదవండి: జగన్‌ ప్రభంజనాన్ని ఆపలేరు)
గెలవలేక టీడీపీ నేతల అరాచకాలు
   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు