Kesineni Nani: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

25 Sep, 2021 08:03 IST|Sakshi

ఎంపీ అభ్యర్థిగా మరొకరిని చూసుకోండి

టీడీపీ అధినేతకు తేల్చిచెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో తాను పార్టీ తరఫున పోటీచేయబోనని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు స్పష్టంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తన బదులు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని ఆయన చెప్పినట్లు సమాచారం. తన కుమార్తె కూడా పోటీచేయబోదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోయిందని చెప్పారు.

ఎన్నికల్లో పోటీచేయకపోయినా పార్టీలోనే కొనసాగుతానని నాని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో మాత్రం చురుగ్గానే ఉంటానని ఆయన చంద్రబాబుకి వివరించినట్లు తెలిసింది. కానీ, ఈ విషయాన్ని కేశినేని నాని ధృవీకరించలేదు. ఆయన అనుచరులు మాత్రం పోటీచేయననే విషయాన్ని నాని చంద్రబాబుకు చెప్పినట్లు చెబుతున్నారు. 

చంద్రబాబు అవమానాలవల్లే..
కొద్దికాలంగా నాని పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు విజయవాడలో పర్యటించినా తనకు సంబంధంలేనట్లు వ్యవహరించారు. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను అవమానించినట్లు నాని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మరో నేత నాగుల్‌ మీరా గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా చంద్రబాబు వాళ్లనే సమర్థించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు.

తన కుమార్తె మేయర్‌ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో అప్పట్లో వెనక్కి తగ్గినా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని కొందరు నాయకులనే చంద్రబాబు నమ్మి తనను అవమానించినట్లు భావిస్తున్నారు. పార్టీ నియామకాల్లోను తనను పట్టించుకోకుండా చిన్నాచితకా నాయకుల మాటలే వింటున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పాలని కేశినేని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు