దుగ్గిరాలలో టీడీపీ నీచ రాజకీయాలు

25 Sep, 2021 04:09 IST|Sakshi
దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికకు హాజరు కాకపోవడంతో ఖాళీగా దర్శనమిస్తున్న టీడీపీ, జనసేన వారి స్థానాలు 

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు సొమ్ములు ఎర

లొంగకపోవడంతో బెదిరింపులు

రంగంలోకి లోకేశ్‌ బృందం

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో టీడీపీ నీచ రాజకీయాలకు దిగింది. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన  ఇద్దరు బీసీ మహిళలను, కొంతమంది ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు సొమ్ములు ఆశ చూపి భంగపడిన నారా లోకేశ్‌ బృందం.. చివరకుబెదిరింపులకు దిగుతోంది. నారా లోకేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఘోర పరాజయం పొందిన నాటినుంచీ మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగకుండా కోర్టులను ఆశ్రయిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న విషయం విదితమే.

దుగ్గిరాల మండల పరిధిలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ.. గెలిచిన వారిలో బీసీ మహిళ లేకపోవడంతో శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలకు టీడీపీ ఎంపీటీసీలంతా గైర్హాజరయ్యారు. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలన్న ఉద్దేశంతో గెలిచిన టీడీపీ అభ్యర్ధులందరినీ విజయవాడలోని నోవా టెల్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు తరలించారు. ఆ తరువాత అక్కడి నుంచి వారిని సికింద్రాబాద్‌ తరలించారు.

ఎంపీటీసీలకు బెదిరింపులు
వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఇద్దరు బీసీ మహిళలను, మరికొందరు ఎంపీటీసీలను టీడీపీ వైపు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ బేరసారాలు కొనసాగిస్తున్నారు. ఇద్దరు బీసీ మహిళలకు రూ.50 లక్షలకు పైగా ఇస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపినప్పటికీ వారు సున్నితంగా తిరస్కరించారు. నాయకుల బేరసారాలు ఫలించకపోవడంతో లోకేశ్‌ బృందం రంగంలోకి దిగింది. బీసీ మహిళా ఎంపీటీసీలకు, ఇతర సభ్యులకు వారి కుల పెద్దలతో ఫోన్లు చేయించి బేరసారాలు చేస్తున్నారు. మరోవైపు వారి బంధువులను ఇళ్లకు పంపించి బెదిరించే కార్యక్రమాలు చేపట్టారు. ఇంకోపక్క ‘భవిష్యత్‌లో మనకు ఇలాంటి అవకాశం రాదు. ఇప్పుడే డబ్బులు సంపాదించుకోవాలి, రేపు పదవి ఉంటుందో ఉండదో. పదవి లేకపోతే ఎవరూ మనవంక చూడరు.

లోకేశ్‌ బాబుకు మద్దతు పలకండి. నాలుగేళ్ల తరువాత జగన్‌ ఉండడు. జగన్‌ లేకపోతే వైఎస్సార్‌ సీపీ ఉండదు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ మేమిచ్చిన డబ్బులు తీసుకుంటే మీరు ఎంపీపీ అయిన తరువాత అభివృద్ధి పనులు ఏం చేసినా సంతకానికి ఒక రేటు ఉంటుందంటూ ఆశ చూపిస్తున్నారు. వారి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదని తెగేసి చెబుతున్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడి కుటుంబ సభ్యులతో టీడీపీ నేతలు మాట్లాడిన ఆడియో లీక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అవినీతి సంపదతో నీతిబాహ్యమైన పద్ధతులతో దుగ్గిరాల ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు