ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలు నిజమే! 

27 Mar, 2023 04:55 IST|Sakshi

టీడీపీ నుంచి రూ.10కోట్లు ఆఫర్‌ ఇచ్చారు: రాజోలు ఎమ్మెల్యే రాపాక  

టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఫైనాన్షియల్‌ మేటర్‌ మాట్లాడదామన్నారు.. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలని కోరారు 

నేరుగా కూడా సంప్రదించారు  

సఖినేటిపల్లి/మలికిపురం: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఆ పార్టీ నుంచి తనకు భారీ ఆఫర్‌ అందినట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ్యుడు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వెల్లడించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

నీతి, నిజాయితీతో పని చేయాలని, అవినీతికి పాల్పడకూడదని కార్యకర్తలకు తాను సూచించినట్లు చెప్పారు. తాను అక్రమాలకు పాల్పడాలనుకుంటే,  తప్పుగా ఓటు వేస్తే కనీసం రూ.10 కోట్లు వచ్చేవని చెప్పానన్నారు. ‘నాకు టీడీపీ నుంచి ఆఫర్‌ వచ్చింది. పా ర్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఫైనాన్షియల్‌ మేటర్‌ మాట్లాడదామని ఉండి ఎమ్మెల్యే రామరాజు నాతో చెప్పారు. నేను వెంటనే తిరస్కరించా. క్రాస్‌ ఓటు చేయబోనని చెప్పాను. దాని గురించి నాతో మాట్లాడవద్దని స్పష్టం చేశా.

అంతకుముందు రోజు నా స్నేహితుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కేఎస్‌ఎన్‌ రాజుతో కూడా ఆయన ఇదే విషయం ప్రస్తావించారు. మీ ఎమ్మెల్యే మాకు అనుకూలంగా ఓటేస్తే మేం అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పారు. అయితే కేఎస్‌ఎన్‌ రాజు.. ఈ విషయం మా ఎమ్మెల్యే(రాపాక)తో చెప్పబోనని, ఇలాంటి వాటికి ఆయన ఒప్పుకోరని స్పష్టం చేశారు. తరువాత రామరాజు నన్ను నేరుగా అప్రోచ్‌ కావడంతో క్రాస్‌ ఓటు చేయబోనని తేల్చి చెప్పా’ అని ఎమ్మెల్యే రాపాక వెల్లడించారు. 

మరిన్ని వార్తలు