మూడు ముక్కలాట.. కమలాపురం టీడీపీలో వర్గపోరు

29 Jun, 2022 11:41 IST|Sakshi

టికెట్‌ నాదేనంటున్న పుత్తా 

కాదు నాదంటున్న వీరశివా 

నేనూ ఉన్నానంటున్న సాయినాథ్‌శర్మ

సాక్షి ప్రతినిధి, కడప: కమలాపురం నియోజకవర్గ టీడీపీలో మూడు ముక్కలాట పతాక స్థాయికి చేరింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి ఈసారి కూడా తనకే టీడీపీ టిక్కెట్‌ అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే వరుసగా మూడుసార్లు ఓటమి చెందిన వ్యక్తికి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేది లేదంటూ ఆ పార్టీ అధిష్టానం నిబంధన పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

పుత్తా నరసింహారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు ఓటమి చెందగా, అంతకుముందు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఒకసారి ఓడిపోయారు. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నాలుగుసార్లు ఓటమి చెందారు. పుత్తా టీడీపీ తరుపున మూడుసార్లు ఓటమి చెందిన నేపథ్యంలో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వరని పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. 

మరోవైపు గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సైతం రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తానేనని విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవలే పార్టీ యువనేత లోకేష్‌ను సైతం కలిశారు. టిక్కెట్‌ తనదేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఇంకోవైపు కమలాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్‌శర్మ సైతం ఈ దఫా కమలాపురం టిక్కెట్‌ తనదేనని ప్రచా రం చేసుకుంటున్నారు.

చాలాకాలంగా పుత్తా నరసింహారెడ్డి, సాయినాథ్‌శర్మల మధ్య విబేధాలు ఉన్నాయి. దీంతో సాయినాథ్‌శర్మ ‘పుత్తా’కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచా రం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తనకే టీడీపీ టిక్కెట్‌ అంటూ ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. టిక్కెట్‌ ఇస్తే ఎంత డబ్బు అయి నా ఖర్చు చేసేందుకు సిద్ధమని, ఇదే విషయం అధిష్టానానికి సైతం తెలిపినట్లు సాయినాథ్‌శర్మ వర్గం ప్రచారం చేస్తోంది. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి పార్టీ టిక్కెట్టు ఇవ్వదని, ఈ లెక్కన తనకే టిక్కెట్టు అంటూ సాయినాథ్‌శర్మ క్యాడర్‌కు చెబుతున్నట్లు సమాచారం. 

ఇప్పటికే చెల్లాచెదురైన క్యాడర్‌
నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు ముఖ్య నేతలు టిక్కెట్‌ నాకంటే నాకంటూ ప్రచారం చేసుకుంటుండడంతో ఉన్న క్యాడర్‌ ఇప్పటికే వర్గాలుగా విడిపోయింది. పైపెచ్చు తమ నేతకే టిక్కెట్టు అంటూ గ్రామ స్థాయిలోనే క్యాడర్‌ సైతం ప్రచారం చేస్తోంది. పుత్తా నరసింహారెడ్డికి నచ్చజెప్పి రాబోయే ఎన్నికల్లో తమ నేతకే టిక్కెట్టు ఇస్తారని వీరశివారెడ్డి వర్గం చెబుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచామని, ఆర్థికంగా నష్టపోయామని, ఈ పరిస్థితుల్లో మరోమారు కూడా తమ నేతకే టిక్కెట్టు వస్తుందని ‘పుత్తా’వర్గం గట్టిగా చెబుతోంది.

ఇదిలా ఉండగా ఒకవేళ తమ నాయకుడికి టిక్కెట్‌ రాకుంటే వీరశివారెడ్డికి మద్దతు ఇస్తాము తప్పించి పుత్తా నరసింహారెడ్డికి  మద్దతు ఇచ్చేది లేదంటూ సాయినాథ్‌ అనుచర వర్గం చెబుతోంది. ముగ్గురిలో ఏ ఒక్కరికీ అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చి నా మిగిలిన ఇద్దరు సదరు నేతకు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఒకవేళ నాయకులు మద్దతు పలికినా కిందిస్థాయిలో క్యాడర్‌ సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉన్న కాస్త క్యాడర్‌ సైతం చెల్లాచెదురయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎటూ తేల్చుకోలేని అధిష్టానం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.  


     

మరిన్ని వార్తలు