పచ్చనేతల కొత్త ఎత్తుగడ!

25 Feb, 2021 12:19 IST|Sakshi

జనం దృష్టి మరల్చేందుకు కుటిల యత్నాలు

పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి

వైఎస్సార్‌సీపీ గెలుపుపై వక్ర భాష్యాలు

ప్రజల సానుభూతి కోసం నడిరోడ్డుపై డ్రామాలు

జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కుతంత్రాలు

సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న సామెత జిల్లా టీడీపీ నాయకులకు అచ్చంగా సరిపోతుంది. ప్రజాబలం కోల్పోయి... అన్ని ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వారికి ఏం చేయాలో తెలియక ఫలితాలపై వక్రభాష్యం చెబుతున్నారు. అంతటితో ఆగకుండా... జనాన్ని తప్పుదారి పట్టించేందుకు సరికొత్త ఎత్తుగడలు మొదలుపెట్టారు. జనంలో తమకు ఏ మాత్రం ఆదరణ లేదని తెలిసినా, తప్పుడు ప్రచారంతో సానుభూతి కోసం తహతహలాడుతున్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేసుకోవడంలో ఆరితేరిన నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్నారేమో... ఇక్కడ ఏకంగా వారే రంగంలోకి దిగి నాటకాలకు తెరతీశారు.

స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం 
జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 955 స్థానాలకు 759 చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు. టీడీపీ కేవలం 149 సీట్లకే పరిమితమైంది.

ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సొంత గ్రామం కవిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అలమంద సుధమ్మ 647 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌చంద్రదేవ్, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు మూకుమ్మడిగా కురుపాంలో తాడంగి గౌరిని టీడీపీ తరపున మద్దతిచ్చి ఎన్నికల్లో నిలిపారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పా ర్టీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు మద్దతుతో పోటీలో నిలిచిన గార్ల సుజాత 92 ఓట్లతో విజయం సాధించారు.

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సొంత గ్రామం చినమేరంగిలోనూ భంగపాటు తప్పలేదు. అక్కడ వైఎస్సార్‌సీపీ మద్దతుదారు అల్లు రవణమ్మ 119 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.

మాజీ మంత్రి కిమిడి మృణాళిని సొంత ఊరైన చీపురుపల్లి మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు మంగళగిరి సుధారాణి విజయం సాధించారు.

పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీలో టీడీపీ మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడి మనుమడు తారకరామానాయుడిపై వైఎస్సార్‌సీపీ మద్దతుదారైన పతివాడ వరలక్ష్మి గెలుపొందారు.

పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు సొంతగ్రామమైన కృష్ణపల్లి పంచాయతీలో గందరగోళం సృష్టించినా ఎమ్మెల్యే అలజంగి జోగారావు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేసిన బోనురామినాయుడు 174 ఓట్లతో విజయం సాధించారు.

గంట్యాడలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడికీ భంగపాటు తప్పలేదు. అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది.

కత్తులు దూసి... కుట్రలు చేసి...       
ఓటమిని తట్టుకోలేక పలు చోట్ల ఉద్రిక్తతలు సృష్టించేందుకు టీడీపీ మద్దతుదారులు యత్నించారు. అడ్డాపుశిల పంచాయతీలో ఓటమిని జీరి్ణంచుకోలేక అరకు ఎంపీ గొట్టేటి మాధవి బంధువైన ఎం.పాల నాయుడుపై మాజీ సర్పంచ్‌ బంటు దాసు మారణాయుధంతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. పూసపాటిరేగ మండలం చౌడవాడ పోలింగ్‌ స్టేషన్‌లో కుర్చీలు పగులగొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆందోళనలు, వాగ్వివాదాల నేపథ్యంలో కొన్ని చోట్ల రీ కౌంటింగ్‌ జరిగింది. ఆ సమయంలోనూ వైఎస్సార్‌సీపీకే విజయం వరించింది. 

కొత్తవలసలో నయా నాటకం
కొత్తవలస మేజర్‌ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోవాలని పోలింగ్‌ బూత్‌ వద్ద హడావుడి చేసి ఉద్రిక్తలు సృష్టించారు. రీ కౌంటింగ్‌కు అవకాశం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తన అనుచరులతో కలిసి గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఎన్నికల అధికారి నిబంధనల ప్రకారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అధికారులను అడ్డుపెట్టుకుని తమ గెలుపును దక్కకుండా చేశారంటూ గొంతు చించుకున్నారు. కానీ జనం పట్టించుకోలేదు.

ఇక చేసేదిలేక ఆత్మహత్యాయత్నం అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సానుభూతి సాధించాలనే కుతంత్రంతో టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని ఉసిగొలిపి నాటకం ఆడించారు. అదీ బెడిసి కొట్టింది. చివరికి ఆత్మహత్యానేరంపై ఆమెపైనా, టీడీపీ నేతలపైనా కేసు నమోదైంది. తాము తీసుకున్న గోతి లో తామే పడ్డామని ఇప్పుడు వారు తలలుపట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న జిల్లాలోని మిగతా టీడీపీ అభ్యర్ధులు మున్సిపల్, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీపై పునరాలోచనలో పడ్డారు. పోటీ చేసి ఉన్న పరువును, డబ్బును అనవసరంగా పోగొట్టుకోవడం ఎందుకనే నిర్ణయానికి ఇప్పటికే వచ్చి కొందరు నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు ‘బంగ్లా’ పెద్దల బలవంతంపై బరిలో నిలిచినప్పటికీ నామ మాత్రంగానే నడుచుకోవాలని భావిస్తున్నారు.
చదవండి:
‘కేశినేని నాని.. పెద్ద గజదొంగ’    
పాపాల పుట్టలు పగులుతున్నాయ్

 

మరిన్ని వార్తలు