అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!

14 Jan, 2023 15:01 IST|Sakshi

తెలుగుదేశం పార్టీలో ఎన్ఆర్ఐల హవా ఎక్కువైంది. అమెరికాలో బాగా సంపాదించి ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. నియోజకవర్గం నేతలకు టెన్షన్ పెడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఐదుసార్లు గెలిచిన ఓ నేతను ఎన్ఆర్ఐ వెంటాడుతున్నాడు. గత ఎన్నికల్లో అడ్రస్ గల్లంతైన ఆ నేత ఎప్పటికీ ఆ సీటు తనదే అనుకుంటున్నారు. ఇంతలో ఎన్ఆర్ఐ రంగ ప్రవేశంతో కంగారుపడుతున్నారట. 

ధూళిపాళ్లకు ఎన్నారై సెగ
ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత  ఎన్నికల్లో పొన్నూరు ఓటర్లు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా పొన్నూరు ముప్పై ఏళ్ల క్రితం ఎలా ఉందో మొన్నటివరకూ అలాగే ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర, అతని తమ్ముడు సురేంద్రలు నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాల ద్వారా వందల కోట్లు సంపాదించారు. సెకండ్ లెవెల్ క్యాడర్ ను ఎక్కడా ఎదగనివ్వలేదు. దీంతో ధూళిపాళ్లపై నియోజకవర్గంలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. కానీ నరేంద్ర మాత్రం పొన్నూరు సీటు తనకు కాదని మరెవరికీ ఇవ్వరనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే పార్టీలోని నరేంద్ర వ్యతిరేకులు ఆయనకు సీటు ఇవ్వొద్దని చంద్రబాబు వద్ద కుండబద్దలు కొట్టారట.

తెనాలి దత్త పార్టీకి
నరేంద్రకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న  నేపధ్యంలోనే ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఉయ్యూరు శ్రీనివాసరావు గుంటూరు వెస్ట్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు ఉయ్యూరు శ్రీనివాస్ మంచి దోస్తులు. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఆలపాటి తనకు నష్టం జరగకుండా వ్యూహం పన్నారు. టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఆలపాటి రాజా ఇన్ ఛార్జిగా ఉన్న తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆలపాటి గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారట. ఈ ఆలోచనతోనే స్నేహితుడైన ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాసరావుకు నువ్వు పొన్నూరులో పోటీ చేస్తే బెటర్ అని కన్విన్స్ చేశారట. ఆలపాటి రాజా ఎన్నారైకి ఈ సలహా ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్ ఉందంటున్నారు. టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ధూళిపాళ్ల, ఆలపాటికి మొదటినుంచి ఒకరంటే ఒకరికి గిట్టదు. సంగం డైరి కొట్టెయ్యాలని ఆలపాటి భావిస్తే నరేంద్ర హస్తగతం చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది పరిస్థితి. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోంది.

చదవండి: (టీడీపీ నేత సంచలన నిర్ణయం.. పవన్‌ పోటీ చేస్తే త్యాగానికి సిద్ధం)

గుంటూరు తొక్కిసలాట పాపం బాబు
ఆలపాటి రాజా తన వ్యూహంలో భాగంగానే ఉయ్యూరు శ్రీనివాసరావును ధూళిపాళ్ల నరేంద్రపైకి వదిలారు. ఆలపాటి సలహాతో  శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు చెప్పారట. ధూళిపాళ్ల నరేంద్ర ఖర్చు పెట్టేదానికంటే రెండింతలు ఎక్కువ ఖర్చుపెడతానని, ఈసారి పొన్నూరు సీటు మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని ఎన్నారై విభాగం ద్వారా చంద్రబాబుపై వత్తిడి తీసుకొస్తున్నారు. వీరికి ఆలపాటి రాజా కూడా తోడయ్యాడు. అందులో భాగంగానే జనవరి 1న ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా చంద్రన్న సంక్రాంతి కానుక సభను నిర్వహించారు. ఈ సభకు చంద్రబాబును చీఫ్ గెస్ట్ గా పిలవడం వెనుక కూడా అసలు స్కెచ్ పొన్నూరు సీటేనని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సభ వ్యవహారాలన్నీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ దగ్గరుండి చూసుకున్నారట. ఉయ్యూరు శ్రీనివాసరావు ఆలపాటి రాజా మినహా మరే ఇతర టీడీపీ నేతకు ప్రాధాన్యత ఇవ్వలేదట. 

పొన్నూరు ఉయ్యూరుకేనా?
పొన్నూరు సీటు ఉయ్యూరు శ్రీనివాసరావుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండడంతో నరేంద్రకు టెన్షన్ పట్టుకుంది. పొన్నూరు సీటు తనకు కేటాయిస్తే లోకేష్ పాదయాత్రకు భారీస్థాయిలో స్పాన్సర్ చేస్తానని కూడా చంద్రబాబుకు ఉయ్యూరు శ్రీనివాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్. ఇలా ఖర్చు భరిస్తానంటే చంద్రబాబుకు కూడా సంతోషమే కదా? ఎగురుకుంటూ వచ్చిన వారికే పచ్చ పార్టీలో సీటు అనే ప్రచారం మరోచోట కూడా నిజం కాబోతోందని టాక్.

- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు