జనసేనను కలుపుకోవాలని బీజేపీ..

19 Nov, 2020 09:24 IST|Sakshi

తిరుపతి ఉప ఎన్నికపై ప్రతిపక్ష పార్టీల మంతనాలు

అభ్యర్థిత్వంపై లోపాయికారీ ఒప్పందాలు

ఎవరికి వారే పోటీకి సన్నాహాలు

రాజకీయం రంగులు మారుస్తోంది.. పొత్తుల కుంపటి రగులుకుంటోంది.. తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీల మధ్య మంత్రాంగం నడుస్తోంది.. లోపాయికారీ ఒప్పందాలకు రంగం సిద్ధమవుతోంది.. జనసేనను కలుపుకోవాలని బీజేపీ భావిస్తోంది.. కమలంతో దోస్తీ కట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోంది..  గెలుపుపై ఆశ లేకపోయినా అభ్యర్థిత్వం కోసం కుస్తీ సాగుతోంది. 

సాక్షి, తిరుపతి : తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన ప్రతిపక్ష పార్టీలు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నాయి.  పొత్తుల కోసం పక్క పార్టీలతో మంతనాలు సాగిస్తున్నాయి.  ఒప్పందం కుదిరినా అభ్యర్థి గా మాత్రం తమ వాడే ఉండాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ఎవరికి వారు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ ఏకంగా అభ్యర్థిని సైతం ప్రకటించింది. అయితే చంద్రబాబు ప్లాన్‌ మాత్రం వేరేగా ఉందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి బరిలోకి దిగాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. జనసేనకు బలం లేకపోయినా సొంతంగానే అభ్యర్థిని నిలబెట్టింది. అప్పుడు ఆయా పార్టీలకు చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం మళ్లీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. (మాట తప్పడమే బాబు నైజం!)

ఒప్పందం కుదిరేనా? 
ఉప ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటే లబ్ధి చేకూరుతుందనే దానిపై ప్రతిపక్ష పార్టీలు తర్జనభర్జన సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణలోని దుబ్బాకలో గెలిచాం గనుక తిరుపతిలో కూడా ఒంటరిగానే నిలబడదామని బీజేపీ భావిస్తోంది. జనసేన మద్దతును మాత్రం కోరుకుంటోంది. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తులు ఉండవని బీజేపీ ప్రకటించడంతో జనసేన ఆగ్రహంగా ఉంది. దుబ్బాకలో వాడుకుని ఇప్పుడు దూరం పెడతారా అని మండిపడుతోంది. తిరుపతిలో పొత్తు కుదిరినా తమ పార్టీ అభ్యర్థినే బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే కాంగ్రెస్‌ కూడా తమ కార్యకర్తలను కూడగట్టేందుకు విఫలయత్నం చేస్తోంది.

రహస్య మంతనాలు 
తిరుపతి ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమే అమలు చేయనున్నట్లు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకునేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎవరికి వారు దళిత కార్డును వాడుకుని ప్రయోజనం పొందేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

 

మరిన్ని వార్తలు