టీడీపీ కార్యాలయం ఎదుట తెలుగు మహిళల ధర్నా

20 Jan, 2022 04:34 IST|Sakshi
ధర్నా నిర్వహిస్తున్న మహిళలు

పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజం

మహిళా కార్యకర్తల్ని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణ

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలుగు మహిళ నాయకులు, కార్యకర్తలు బుధవారం ధర్నా నిర్వహించారు. టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. లోకేష్‌ పీఏ సాంబశివరావు బృందం టీడీపీలోని మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తక్షణమే న్యాయం చేయకపోతే పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా పెదవడ్లపూడి గ్రామానికి చెందిన మహిళా టీడీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి మాట్లాడుతూ.. పార్టీ కోసం తాము పనిచేస్తుంటే అకారణంగా తమను ఎందుకు  సస్పెండ్‌ చేశారో సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కోసం పనిచేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం, అవమానాలు జరుగుతున్నాయన్నారు. బడుగు బలహీనవర్గాలకు, దళితులకు టీడీపీలో సరైన ప్రాతినిధ్యం లేదని వాపోయారు. దళితులకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక్కరికైనా మండల అధ్యక్ష పదవి కేటాయించారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థులను ఓడిస్తున్న పార్టీ మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావును ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం లేదని నిలదీశారు. పార్టీలో చంద్రబాబు సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటోందని, మరే సామాజిక వర్గానికి పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని వాపోయారు. అన్ని సామాజిక వర్గాలు గుర్తించాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తాము ఏ తప్పు చేశామో తమకు సమాధానం చెప్పాలని, లేదంటే పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు చేరుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాలు చేయడం సమంజసం కాదన్నారు. సమస్యను రాతపూర్వకంగా తెలియజేస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనడంతో మహిళలు ఆనంద్‌బాబుకు వినతిపత్రం అందజేసి ఆందోళన విరమించారు. 

మరిన్ని వార్తలు