పచ్చ పార్టీ.. పచ్చ కుట్రలు.. ఫేక్‌ న్యూస్‌తో ఎల్లో మీడియా శునకానందం..

4 Feb, 2023 19:47 IST|Sakshi

టీడీపీ గ్రాఫ్ పెంచలేకపోతున్నారు. పడిపోతోన్న బాబు ఇమేజ్‌ని లేపలేకపోతున్నారు. పైనున్న ప్రభుత్వ ఇమేజ్‌ని  డ్యామేజ్ చేస్తే పోలా అనుకున్నారు. అంతే ఫేక్ జీవోలతో ఫేక్ సర్వేలతో ఫేక్ వ్యవహారాలు నడుపుతూ దిగజారుడుగా వ్యవహరిస్తున్నారు ఎల్లో కూలీ మీడియా పెద్దలు. ఆ మధ్య ఫేక్ జీవో వైరల్ చేసి శునకానందం పొందారు.  అది జనం నమ్మకపోవడంతో ఫేక్ సర్వేతో తెరపైకి వచ్చారు. అదీ వర్కవుట్ కాకపోవడంతో సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీలతో సంతృప్తి చెందుతున్నారు. ఎల్లో గ్యాంగ్ వారి కూలీ మీడియాల వ్యవహారాలు చూసి జనం ఏవగించుకుంటున్నారు.

రిటైర్మెంట్ పేరిట ఫేక్ న్యూస్
కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియాలో ఓ కథనం హల్ చల్ చేసింది. అదేంటంటే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్ల నుండి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు   ప్రభుత్వం జీవో జారీచేసినట్లు కథనం అల్లారు. అయితే అసలు అటువంటి జీవో ఏదీ తాము జారీ చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్లో గ్యాంగ్ పనిగట్టుకుని నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దాన్నే  ఈనాడు పత్రికలో బ్యానర్ స్టోరీ చేసేశారు. 

సర్వేల పేరిట ఫేక్ న్యూస్
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ఏపీలో ఓ సర్వే చేసిందని అందులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని ఓ కథనాన్ని వండి వార్చేశారు. ఈ ఫేక్ సర్వే గురించి ఎల్లో కూలీ మీడియాలో బ్యానర్ స్టోరీ వచ్చిన మరుక్షణమే ఐ ప్యాక్ సంస్థ స్పందించింది. తాము అసలు చాలా కాలంగా ఎలాంటి సర్వేలు జరపనే లేదని ఎల్లో మీడియాలో వచ్చిన కథనం అంతా ఫేకే నని ఐ ప్యాక్ ట్వీట్ చేసింది.

మనవాడు వచ్చాడంటూ ఫేక్ సర్వే
రఘురామ సర్వే పేరుతో ఒకటి, ఆత్మసాక్షి పేరుతో మరో సర్వే వెలువడ్డట్లు  ప్రచారం చేశారు. రఘురామ సర్వే అనగానే  ఆయన ఎవరికి అనుకూలమో ఎవరిపై రోజూ విషం చిమ్ముతూ ఉంటారో అందరికీ తెలుసు. ఆ సర్వేలో ఆయన ఎవరికి అనుకూలంగా అంశాలను మలుస్తాడో కూడ అందరికీ తెలుసు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే నేతలు సర్వే చేసినట్లు చెప్పడం వాటిని ఎల్లో మీడియాలో ప్రచురించి ప్రజల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అవాస్తవాలు ప్రచారం చేయడం ఎల్లో గ్యాంగ్ లక్ష్యాలుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.

2019లోనూ ఫేక్ సర్వేలు
2019 ఎన్నికల సమయంలోనూ ఎల్లో బ్యాచ్  ఫేక్ సర్వేలతో   ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు  విఫల యత్నాలు చేసింది. అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా వ్యక్తిగతంగా సర్వేలు నిర్వహించినట్లు చెప్పుకున్నాయి. కేవలం ఎల్లో మీడియా మాత్రమే చెబితే జనం నమ్మరేమోనని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో చీకట్లో భేటీ అయిన విజయవాడ మాజీ ఎంపీ ఆంధ్రా ఆక్టోపస్ను తెరపైకి తెచ్చింది టీడీపీ. ఈ సర్వేలన్నింటినీ ఎడం కాలితో తన్నేసిన ఓటర్లు  175 స్థానాలున్న ఏపీలో 151 స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించి టీడీపీకి కేవలం 23 స్థానాలు విదిల్చారు.

ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డిపై  నిత్యం ఏదో ఒక  విష ప్రచారంతో   విరుచుకు పడుతూనే వస్తున్నారు ఎల్లో బ్యాచ్ పెద్దలు. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు చంద్రబాబు హయాంలో కన్నా చాలా ఎక్కువగా వస్తోంటే ఏపీ నుండి పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఒక్క కొత్త పరిశ్రమ కూడా రావడం లేదని ఎల్లో కూలీ మీడియా  కథనాలు వండి వార్చింది. 

అప్పులపై ఫేక్ ప్రచారం
చంద్రబాబు పాలనలో చేసిన అప్పులతో పోలిస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు చాలా చాలా తక్కువే. అయినా జగన్ పాలనలోనే ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు ఫేక్ స్టోరీలు వండి వార్చారు. సంక్షేమ పథకాలతో ఏపీలో  అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఎవ్వరికీ ఏ పథకమూ అందడం లేదంటూ  కుట్ర కథలు ప్రచారంలో పెట్టారు. బడుగు బలహీన వర్గాలకు పదవుల్లో పెద్ద పీట వేస్తే..  ఆ వర్గాలకు అన్యాయం జరిగిపోతోందంటూ   దొంగ ఏడుపులు ఏడుస్తూ విషం చిమ్ముతున్నారు. దేశంలోనే  ప్రగతి పథంలో ఏపీ అగ్రగామిగా దూసుకుపోతూ ఉంటే  ఏపీ శ్రీలంక అయిపోతోందంటూ  కుళ్లు కథలు  చెప్పుకుపోతున్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏపీ అమెరికాలో మెరిసిపోయినట్లు.. జగన్ పాలనలో  అమెరికాలా ఉన్న ఏపీ కాస్తా  దివాళా తీసేసినట్లు దిగజారుడు రాతలతో పేట్రేగిపోతున్నారు. అన్నీ ఫేకే. ఒక్కదాంట్లోనూ నిజం లేదు. ఒక్క కథనంలోనూ విలువలు లేవు. తాము రాసేది తప్పని వారికి తెలుసు. తాము చిమ్మేది విషమని తెలుసు. తమ బాబు పాలనకన్నా ఇపుడే బాగుందని కూడా తెలుసు. అయినా తమ బాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఎల్లో కూలీ మీడియా ఫేక్ వేషాలతో  రెచ్చిపోతోంది. 

ఫేక్ స్టోరీలు సృష్టించడం వాటిని ప్రచారంలో పెట్టించడం వాటిని చూసి  స్పందించినట్లుగా  టీడీపీ శ్రేణుల చేత గొడవలు చేయించడం.. వాటికి వత్తాసుగా పవన్ కళ్యాణ్ చేత వేషాలు వేయించడం అన్నీ కూడా చంద్రబాబు నాయుడి పొలిటికల్ గేమ్‌లో భాగంగానే జరుగుతున్నాయంటున్నారు పాలక పక్ష నేతలు. అందుకే ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు, కథనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు