అది రెండు కుటుంబాల గొడవ

9 Nov, 2022 03:58 IST|Sakshi
ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో నిందితుడు రామారావు

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో స్థల వివాదం

టీడీపీ హయాం నుంచీ రగడ.. తాజాగా ఓ వర్గంపై మరో వర్గం వారు మట్టిపోసిన వైనం

ఈ వ్యవహారాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగట్టి టీడీపీ నీచ రాజకీయం

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని హరిపురంలో రెండు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ల నుంచి స్థల వివాదం ముదిరి.. సోమవారం (ఈ నెల 7వ తేదీన) ఇద్దరు మహిళలపై గులకరాళ్లతో కూడిన మట్టి పోసే వరకు వెళ్లిన వ్యవహారంలో టీడీపీ రాజకీయ చలి మంటకు సిద్ధమైంది. ఆ గ్రామంలోని రామారావు, ప్రకాశరావు, ఆనందరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర మట్టి వేస్తుండగా.. వారి సమీప బంధువులు కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలు వెనక వైపునకు వెళ్లి అడ్డుకున్నారు.

అదే సమయంలో వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. నడుంలోతు వరకు వారు కూరుకు పోవడంతో పెద్దగా రోదించారు. చుట్టు పక్కల వారు వచ్చి బయటకు లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్ని మంగళవారం అరెస్ట్‌ చేశారు. కాగా, టీడీపీ హయాంలో 2017, 2019లో బాధిత మహిళలు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది.

ఇలా లింకు పెట్టొచ్చా..
మహిళలపై మట్టిపోసిన ఘటనలో ప్రధాన నిందితుడు కొట్ర రామారావుకు.. టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావుతో మంచి సంబంధాలున్నాయి. అలాగని వీరంతా ఇతనికి అండగా నిలిచారని చెప్పలేం.

అలా అనడం తప్పు కూడా. అయితే ఇది రెండు కుటుంబాల మధ్య వివాదం అనే కనీస అవగాహన లేకుండా చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేశ్‌లు ఈ ఘటనపై వరుస ట్వీట్లతో వైఎస్సార్‌సీపీపై బురద చల్లి, నీచ రాజకీయం చేశారు. పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ, లేదని దుష్ప్రచారం చేశారు.

మరిన్ని వార్తలు