బీజేపీ ఖాతాలో టీచర్‌ ఎమ్మెల్సీ 

18 Mar, 2023 01:45 IST|Sakshi

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం 

పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతల సంబరాలు... పార్టీ అభ్యర్థికి ఓటేసిన 

టీచర్లకు బండి సంజయ్‌ సెల్యూట్‌ 

చరిత్రాత్మక విజయమన్న అమిత్‌ షా 

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి (పీఆర్‌టీయూటీఎస్‌) గుర్రం చెన్నకేశవరెడ్డిపై ఆయన 1,169 ఓట్లు అధికంగా సాధించారు.

నియోజకవర్గ పరిధిలో మొత్తం 29,720 మంది ఓట్లర్లు ఉండగా వారిలో 25,868 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఏవీఎన్‌ రెడ్డి  13,436 ఓట్లు సాధించి ఎన్నికల్లో గెలుపొందారు. 

బీజేపీ సంబరాలు... 
ఏవీఎన్‌ రెడ్డి విజయంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఏవీఎన్‌ రెడ్డిని  ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సన్మానించారు. ఆయన విజయానికి పార్టీ తరఫున కృషి చేసిన నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్‌.రామచంద్రరావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సుభాష్‌ చందర్‌జీలను అభినందించారు. సంజయ్‌ సారథ్యం ఫలితంగానే తాను గెలిచినట్లు వ్యాఖ్యానించిన ఏవీఎన్‌ రెడ్డి... బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం అక్కడ జరిగిన విజయోత్సవాల్లో మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, డా.జి.మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్య కర్తలు బాణసంచా పేల్చి బ్యాండ్‌మేళాలతో సంబరాలు చేసుకున్నారు. సంజయ్‌ మాట్లాడుతూ బీజేపీ అభ్య ర్థి కి ఓటేసిన టీచర్లకు సెల్యూట్‌ చేస్తున్నామన్నారు.

‘317 జీవోతో చెట్టుకొకరినీ.. పుట్టకొకరినీ చేసినందుకు, పీఆర్‌సీ కమిటీ ప్రకటించనందుకు, 3 డీఏలు బాకీ ఉన్నందుకు సీఎం కేసీఆర్‌కు తాము ఏమిటనేది ఈ ఎన్నికల్లో టీచర్లు చూపించారు. సీఎంకు కొమ్ము కాసే ఉపాధ్యాయ సంఘాలకు ఇదో గుణపాఠం. టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తాం’అని పేర్కొన్నారు. 

బీజేపీ అగ్రనేతల ట్వీట్లు 
ఏవీఎన్‌ రెడ్డి విజయంపట్ల బీజేపీ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి ప్రభుత్వంతో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలో పారదర్శక, పేదలపక్ష ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించి మోదీ సారథ్యంలోని బీజేపీని ముందుచూపుతో హత్తుకున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. ‘ఇది పేదల వ్యతిరేక, అభివృద్ధి నిరోధక, అవినీతి, కుటుంబ బీఆర్‌ఎస్‌పై, ఆ పార్టీ అహంభావ, గరి్వష్టి నాయకత్వంపై ప్రజలిచి్చన మరో తీర్పు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

బీజేపీలో నయాజోష్‌... 
సాక్షి, హైదరాబాద్‌: టీచర్‌ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ద్వారా బీజేపీకి శాసనమండలిలో మళ్లీ ప్రాతినిధ్యం లభించినట్లు అయింది. గతంలో గ్రాడ్యుయేట్‌గా ఎమ్మెల్సీగా రాంచందర్‌రావు పార్టీపక్షాన ప్రజాసమస్యలను లేవనెత్తేవారు. ఆ తర్వాత కౌన్సిల్‌లో పా ర్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.  టీచర్లు, ఉద్యోగుల స్థానికత, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా తాము నిర్వహించిన ఆందోళనలు, కేసీఆర్‌ సర్కార్‌  ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు, టీచర్లు సహా ప్రజాసమస్యలపై  తమ పోరాటాలకు ఈ గెలుపు రూపంలో మద్దతు లభించిందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల అధినేత అయిన ఏవీఎన్‌ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్‌ లభించడంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలకపాత్ర పోషించారు. ఏవీఎన్‌ రెడ్డిని పోటీ చేయించి గెలిపిస్తే మరికొందరు బీజేపీలో చేరడం ఖాయమంటూ అధిష్టానాన్ని ఒప్పించారు. అందుకే ఇప్పటిదాకా ఎవరికీ నేరుగా బీఫారం ఇవ్వని బీజేపీ.. ఏవీఎన్‌ రెడ్డికి టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంది.  

మరిన్ని వార్తలు