సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు 

6 Jul, 2022 06:51 IST|Sakshi

అభివృద్ధి పేరిట చెరువులను నాశనం చేస్తున్నారు 

మంత్రిపై మాజీ ఎమ్మెల్యే తీగల ధ్వజం  

ఆమె తమ పార్టీ ఎమ్మెల్యే కాదని వ్యాఖ్య  

మీర్‌పేట (హైదరాబాద్‌)/షాద్‌నగర్‌: అభివృద్ధి పేరిట మంత్రి సబితారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, మీర్‌పేట ప్రాంతంలోని చెరువులను నాశనం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. మంత్రాల చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి అనుచరులు షెడ్లు ఎలా నిర్మిస్తారని నిలదీశారు.

మంత్రి సబితారెడ్డి వ్యవహారం వల్లే సరూర్‌నగర్, ఆర్‌కేపురం, తుక్కుగూడ, కందుకూరులో టీఆర్‌ఎస్‌ బలహీనపడటంతో పాటు చాలామంది పార్టీని వీడుతున్నారని తెలిపారు. మంత్రి సబితారెడ్డి తమ పార్టీ నుంచి గెలవలేదని, ఆమె తమ ఎమ్మెల్యే కాదంటూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్‌ పరిధి మంత్రాల చెరువులోని డీసీఎం అడ్డా వద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో తీగల మాట్లాడారు. 

పార్టీ మారను: అభివృద్ధి పేరిట కబ్జాలను ప్రోత్సహిస్తున్న మంత్రి చర్యలను ఖండిస్తున్నానని తీగల పేర్కొన్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ వల్ల ప్రజలకు ఏం ప్రయోజన చేకూరుతుందో చెప్పాలన్నారు. ముందుగా చెరువుకు సంబంధించిన ట్రంక్‌లైన్‌ పనులు పూర్తి చేయాలని, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. చెరువులు కబ్జాకు గురైతే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తాను రాజకీయం చేడయం లేదని, పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మీర్‌పేట ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని చెప్పారు.  

కృష్ణన్నను తప్పుదోవ పట్టించారు: మంత్రి సబిత  
తీగల కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తన నియోజకవర్గం పరిధిలో భూ కబ్జాలు జరిగి ఉంటే సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటారని చెప్పారు. షాద్‌నగర్‌ నియోజకవర్గం నందిగామలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తీగల చేసిన ఆరోపణలను ఖండించారు. ‘కృష్ణన్న నాపై అలా ఎందుకు మాట్లాడారో తెలియదు.. ఎవరో ఆయనను మిస్‌గైడ్‌ చేసి ఉంటారు’అని వ్యాఖ్యానించారు.  

చదవండి: (విషం తప్ప.. విషయం లేదు)

మరిన్ని వార్తలు