కేసీఆర్‌ను ఇంటికి పంపేవరకు ఈ పాదయాత్ర ఆగదు 

27 Nov, 2022 01:24 IST|Sakshi
సభలో ప్రసంగిస్తున్న మల్లన్న 

భద్రాచలం: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఇంటికి పంపేంతవరకు తాను ఇంటికి పోనని...అప్పటివరకు ఈ పాదయాత్ర ఆగదని భద్రాద్రి రామయ్య పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని తీన్మార్‌ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో 31రోజుల పాటు 7,200 కి.మీ.మేర సాగనున్న మల్లన్న పాదయాత్ర భద్రాచలంలో శనివారం ప్రారంభమైంది. కాగా, తొలుత శ్రీ సీతారామ చంద్రస్వామిని దర్శించుకున్నారు.

ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన సభలో మల్లన్న మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక భద్రాద్రి రాముడే తొలి బాధితుడన్నారు. ఏడు మండలాలను ఏపీలోకి వదలడం మొదలు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తామంటూ అనేకమార్లు భద్రాద్రి రామయ్యను, ఇక్కడి ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.

గిరిజనులకు పట్టాలిస్తానని ఒక వైపు, పోడు భూములను కాపాడాలని అటవీ ఉద్యోగులను మరోవైపు రెచ్చగొట్టడంతోనే అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్య జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాగా, తొలుత సభకు అనుమతి లేదని ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మల్లన్న టీం సభ్యులు ధర్నాకు దిగగా, అనుమతి వచ్చిన అనంతరం సాయంత్రం సభ నిర్వహించారు. 

మరిన్ని వార్తలు