'ఎస్సీ, ఎస్టీల హ‌త్య‌ల‌ను ప్రొత్స‌హించ‌డ‌మే'

5 Sep, 2020 18:27 IST|Sakshi

పట్నా: బిహార్‌లోని నితీష్ కుమార్ ప్ర‌భుత్వంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్రంలోని హ‌త్య‌కు గురైన ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణయంపై తేజ‌స్వీ యాద‌వ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిహార్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేపథ్యంలో ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ద‌ళితుల‌ను అస్త్రంగా వాడుతున్నార‌ని ఆర్జేడీ నేత ఆరోపించారు. ఈ నిర్ణ‌యం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల హ‌త్య‌ల‌ను ప్రొత్స‌హిస్తున్న‌ట్లు ఉంద‌ని మండిప‌డ్డారు. మిగ‌తా కులాలైన ఓబీసీ, జ‌న‌ర‌ల్‌ కేట‌గిరీకి చెందిన వారిని ఎందుకు ఈ విధానంలోకి చేర్చ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. (బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ అప్‌డేట్‌)

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌డంలో నితీష్ కుమార్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని తేజ‌స్వీ యాద‌వ్ విమ‌ర్శించారు. ఇప్ప‌టికీ దేశంలో అత్యధికంగా నిరుద్యోగిత శాతం (46%)  బిహార్ రాష్ట్రంలోనే ఉంద‌ని ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని ఎత్తి చూపుతూ తేజ‌స్వీ యాద‌వ్ అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంలోని వివిధ విభాగాలలో సుమారు 4.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా నవంబర్‌ 29లోగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయ‌ని  ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్ర‌వారం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అదే సమయంలో ఓ లోక్‌సభ స్ధానంతో పాటు 64 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పారు

మరిన్ని వార్తలు