బిహార్‌లో నేనే విజేత: తేజస్వి

13 Nov, 2020 03:42 IST|Sakshi

ప్రజల హృదయాల్లో ఆర్జేడీకే చోటు

కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తేజస్వి

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యువ కెరటంగా నిలిచిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వి యాదవ్‌ తానే అసలు సిసలైన విజేతనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నప్పటికీ ప్రజల హృదయాలను తామే గెలిచామన్నారు. గురువారం మహాకూటమి శాసనసభా నేతగా ఎన్నికైన తేజస్విæ ప్రధాని మోదీ, బిహార్‌ సీఎం నితీశ్‌లపై నిప్పులు చెరిగారు. వారు దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. 20 స్థానాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సరిగా జరగలేదని, చాలా ఓట్లని చెల్లని ఓట్లు అంటూ పక్కన పెట్టారని విమర్శించారు. ఆ స్థానాల్లో రీకౌంటింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ‘నితీశ్‌‡ ఛరిష్మా ఏమైపోయింది ? ఆయన పార్టీ మూడో స్థానానికి దిగజారిపోయింది. మార్పు కావాలని ప్రజలు అనుకుంటున్నారు. నితీశ్‌ సీఎం పీఠంపై కూర్చోవచ్చు కానీ మనం ప్రజల హృదయాల్లో నిలిచాం’ అని తేజస్వి అన్నారు. ఎన్డీయే, మహాఘట్‌ బంధన్‌ మధ్య ఓట్ల తేడా కేవలం 12,270 మాత్రమేనని అలాంటప్పుడు వారికి 15 సీట్లు అధికంగా ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఓట్ల తేడా 0.03%
ఎన్నికల్లో హోరాహోరి పోరు మధ్య బొటాబొటి సీట్ల మెజారిటీతో అధికార పీఠాన్ని దక్కించుకున్న ఎన్డీయే ఓట్ల విషయంలో మరీ వెనుకబడిపోయింది. ఎన్డీయేకి, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌ బంధన్‌కి మధ్య ఓట్ల శాతంలో తేడా  కేవలం 0.03శాతం. ఎన్డీయే కూటమికి 37.26శాతం ఓట్లు పోలయితే, మహాఘట్‌ బంధన్‌ కూటమికి 37.23% ఓట్లు పోలయ్యాయి. మిగిలిన పార్టీలకు 25.51% ఓట్లు వచ్చాయి. మొత్తం పోలయిన 3.14 కోట్ల ఓట్లలో ఎన్డీయేకి 1,57,01,226 ఓట్లు వస్తే, మహాఘట్‌ బంధన్‌కి 1,56,88,458 ఓట్లు వచ్చాయి. అంటే ఈ రెండు కూటముల మధ్య తేడా కేవలం 12,768 ఓట్లు మాత్రమే. ఇరుపక్షాల మధ్య గెలుపు ఆధిక్యాలు అత్యంత స్వల్పంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం గణాంకాల్లో తేలింది. 243 సీట్లకు గాను 130 సీట్లకు సంబంధించి మొత్తం పోలయిన ఓట్లలో సగటు ఆధిక్యం 16,825గా ఉంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు