మీ మేనల్లుడు మోదీని అడ్డుకుంటాడు: తేజస్వీ యాదవ్‌

12 Feb, 2024 15:39 IST|Sakshi

బిహార్‌లో జేడీ(యూ).. బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు(సోమవారం) నితీష్‌ కుమార్‌ జేడీయూ ప్రభుత్వం బలపరీక్ష ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. నితీష్‌ కుమార్‌పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. బిహార్‌లో ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఆధ్వరంలోని బీజేపీని తాము ఎదుర్కొంటామని అ‍న్నారు. ఒక టర్మ్‌లో మూడుసార్లు సీఎం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్‌ మిగిలిపోతారని తేజస్వీ యాదవ్‌ ఎద్దేవా చేశారు.

‘నితీష్‌ కుమార్‌ విషయంలో జేడీయూ ఎమ్మెల్యేలు బాధ పడతారు. ఎందుకంటే వారు ప్రజల్లోకి వెళ్లితే..  ప్రజల నుంచి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.  మీ నాయకుడు మూడు సార్లు సీఎంగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే ఏం చెబుతారు?. గతంలో బీజేపీని తిట్టి.. ఇప్పుడు అదే పార్టీపై పొగడ్తలు కురిపిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తారు?’ అని జేడీ(యూ) ఎమ్మెల్యేలను  తేజస్వీ ప్రశ్నించారు.

‘నేను సీఎం నితీష్‌ కుమర్‌కు ఓ కుటుంబ సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మాదంతా సమాజ్‌వాదీ కుటుంబం.దేశవ్యాప్తంగా బీజేపీని అడ్డుకున్నేందు మీరు(నితీష్‌కుమార్) ఎగురవేసిన జెండాను మీ మేనల్లుడు(తేజస్వీ యాదవ్‌) కొనసాగిస్తాడు. బిహార్‌లో మోదీని అడ్డుకుంటాం’ అని తేజస్వీ అన్నారు.

నితీష్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తరచూ ‘మామా’ అని ఆప్యాయంగా పిలుస్తారన్న విషయం తెలిసిందే. బీజేపీ దివంగత సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ఇవ్వటం సంతోషమన్న తేజస్వీ.. ఒక  రాజకీయ ఒప్పదం ప్రకారమే ఇచ్చిందని మండిపడ్డారు. ఆ క్రమంలో బిహార్‌లోని మహాఘట్‌బంధన్‌ను బీజేపీ చీల్చిందని దుయ్యబట్టారు తేజస్వీ యాదవ్‌.

చదవండి: బలపరీక్ష నెగ్గిన నితీష్‌ సర్కార్‌

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega