కేంద్రంపై పోరు ఆగదు: మంత్రి నిరంజన్‌రెడ్డి

6 Dec, 2021 02:21 IST|Sakshi

పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గోయల్‌ అబద్ధాలు 

కేసీఆర్‌ పిలుపుతో రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో కంది సాగు 

భవిష్యత్తులో పత్తి సాగు కోటి ఎకరాలకు పెంచుతామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, కేంద్రంతో పోరు కొనసాగుతుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చెప్పారు. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘ఏ రాష్ట్రంలోనైనా ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి బాధ్యతలు ఎఫ్‌సీఐ చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం మాత్రమే అందిస్తాయి. రాష్ట్రంలో యాసంగిలో ఉప్పుడు బియ్యమే పండుతాయని కేంద్రానికి తెలిసినా భవిష్యత్తులో పచ్చి బియ్యమే తీసుకుంటామని అడ్డగోలుగా వాదిస్తోంది’అని విమర్శించారు.  

కంది సాగును 20 లక్షల ఎకరాలకు పెంచుతాం 
వ్యవసాయ చట్టాల మీద రైతులే స్వయంగా పోరాటం చేశారని.. తెలంగాణ రైతుల కోసం పార్లమెంటులో, బయట పోరాడుతున్నది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రం విధానాలు గమనించే పంటల మార్పిడి వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, కేసీఆర్‌ పిలుపు మేరకు ఈసారి 10 లక్షల ఎకరాలలో కంది సాగు చేశారని చెప్పారు. దీన్ని భవిష్యత్‌ లో 20 లక్షల ఎకరాలకు, పత్తి కోటి ఎకరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని వెల్లడించారు.   

మరిన్ని వార్తలు