హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి 

25 Aug, 2020 03:42 IST|Sakshi

అఖిలపక్ష నేతల డిమాండ్‌  

హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాలని, రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం అఖిలపక్ష నేతలు కోదండరాం, ఎల్‌.రమణ, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు కింగ్‌కోఠి కోవిడ్‌ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్సలపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  కోదండరాం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కింగ్‌కోఠి ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆసుపత్రిలో 200 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అయినా అధికారులు బెడ్లు ఖాళీ లేవని రోగులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలతో ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోతోందన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం చికిత్సకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలని ఆయన సూచించారు. టీటీడీపీ నేత ఎల్‌.రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే ప్రజలు సర్కారు ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్నారు. 

మరిన్ని వార్తలు