ఎస్సీ సీట్లన్నీ మనవే కావాలి

29 Dec, 2021 02:56 IST|Sakshi

రాష్ట్రంలోని 19 రిజర్వ్‌డ్‌ సీట్లలో గెలవడమే బీజేపీ లక్ష్యం: బండి సంజయ్‌ 

‘మిషన్‌–19’ కార్యాచరణ రూపొందించామని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార సాధనకు మొత్తం 19 ఎస్సీ సీట్లలో గెలుపొంది సత్తా చాటేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కేడర్‌కు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. మంగళవారం ఒక ప్రైవేట్‌ హోటల్‌లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన ఎస్సీ స్థానాలపై పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన అంతర్గత వర్క్‌షాప్‌లో ముఖ్య అంశాలపై సమాలోచనలు జరిపారు.

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘దళిత సీఎం మొదలు దళితబంధు వరకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ విఫలమైంది. దళితులంతా బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి రావడమే పార్టీ అంతిమ లక్ష్యం. ఇది నెరవేరాలంటే ఎస్సీ సీట్లలో గెలుపు చాలా కీలకం.

ఎస్సీ స్థానాలపై స్పెషల్‌ ఫోకస్‌గా మిషన్‌–19 పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. దీనికి అనుగుణంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. నియోజకవర్గ స్థాయిలోనూ సమస్యలను గుర్తించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి’అని సూచించారు. కార్యక్రమంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎ.చంద్రశేఖర్, జి.విజయరామారావు, జి.వివేక్‌ వెంకటస్వామి, రవీంద్ర నాయక్, ఎస్‌.కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, జి.మనోహర్‌రెడ్డి, కొప్పు భాషా పాల్గొన్నారు.      

మరిన్ని వార్తలు