అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ అబద్ధాలు 

6 Oct, 2021 02:52 IST|Sakshi

రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్టు పీఆర్సీ ఇచ్చిన నివేదిక మర్చిపోయారా?: బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తూ.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. పద్మ అవార్డులు, ఎయిర్‌పోర్టులు, ఇతర అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.  ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు బండి సంజయ్‌ మాటల్లోనే.. 

దివాళాకోరుతనం 
‘‘పద్మ అవార్డుల విషయంలో కేంద్రం పారదర్శకమైన విధానాన్ని అవలం బించడం వల్లే రాష్ట్రం నుంచి పేదలైన వనజీవి రామయ్య, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింద మల్లేశం వంటివారికి పద్మ అవార్డులు వచ్చాయి. అయినా ప్రధానిని నిందించడం ఎంత వరకు కరెక్టు?

నిజంగా అర్హులుంటే కేంద్రానికి సిఫార్సు చేయాలే తప్ప అసెంబ్లీ సాక్షిగా ప్రధానిని అవమానించేలా మాట్లాడటం కేసీఆర్‌ దివాళాకోరుతనానికి నిదర్శనం. కేసీఆర్‌కు సోయి లేనప్పుడే విదేశాంగమంత్రి జైశంకర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి యునెస్కో సభ్య దేశాలను ఒప్పించి రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చారు. ఈ ఘనత మోదీ ప్రభుత్వానిది కాదా?’’ 

ప్రతిపాదన పంపకుండా ఆరోపణలా? 
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో మాట్లాడారా? కనీసం ఒక్క ప్రతిపాదన అయినా పంపారా? అలా చేయకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? కేంద్రమంత్రిని ఇంటికి పిలిచి తిండి పెట్టి అడిగినా విమానాశ్రయాలకు గుర్తింపు ఇస్తలేరంటూ దిగజారి మాట్లాడతారా? తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటు విషయంగా కేంద్రం సాంకేతికంగా క్లియరెన్సులు ఇచ్చింది.

‘రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని మంగళవారం జరిగిన దక్షిణమధ్య రైల్వే సమావేశంలో రైల్వే జీఎం స్పష్టం చేశారు. ఆ సమావేశం లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా ఉన్నారు. 

ఉద్యోగ ఖాళీలను మర్చిపోయారా? 
రాష్ట్రంలోని 31 శాఖల్లో 4,91,304 ఉద్యోగులకు గాను 3,00,178 మందే ఉన్నారని తాజాగా పీఆర్సీ కమిటీ స్పష్టం చేసింది. ఇంకా 1,91,126 ఉద్యో గాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన మాటను కేసీఆర్‌ విస్మరించారా? పనిచేస్తున్న 3 లక్షల మంది ఉద్యోగుల్లోనూ దాదాపు లక్ష మంది కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులేనని కమిటీ బయటపెట్టిన కఠోర వాస్తవాలను ఎందుకు దాస్తున్నారు?’’   

మరిన్ని వార్తలు