షరియత్‌ చట్టం అమలుకు కుట్ర: సంజయ్‌

21 Mar, 2022 03:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో షరియత్‌ చట్టం అమలుకు కేసీఆర్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బోధన్‌లో భజరంగ్‌దళ్, హిందూవాహిని కార్యకర్తలపై కొంతమంది ఛాందసవాదులు, పోలీసులు కలసి దాడి, లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బోధన్‌ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానించాక టీఆర్‌ఎస్‌ మైనారిటీ నాయకులు రాళ్ల దాడి చేయడం, పోలీస్‌ కమిషనర్‌ భజరంగ్‌దళ్‌ కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తూ రబ్బర్‌ బుల్లెట్లతో కాల్పులు జరపడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు.

ఆదివారం ఆ పార్టీ నాయకులతో కలసి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. శివాజీ విగ్రహం కాకుండా అక్కడ ఔరంగజేబు విగ్రహం పెట్టాలా? అని ప్రశ్నించారు. ‘ఈ సీపీకి ఎంపీ టికెట్‌ ఇస్తానని కేసీఆర్‌ చెప్పిండట. సీపీయే ఈ విషయం మీడియాతో చెప్పిండు. ఇలాంటి వ్యక్తి సీపీగా ఉండటం సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బియ్యం సేకరణ గోల్‌మాల్‌ అవినీతి భాగోతం వెనుక మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల హస్తం ఉందని ఆరోపించారు. 

బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందా?
‘కేసీఆర్‌.. యాసంగి బియ్యం కొనడం లేదని మీతో ఎవరు చెప్పిండ్రు. పోయినసారి కూడా గిట్లనే అన్నవ్‌. వడ్లు కొనకపోతే పార్లమెంట్‌ ముందు, ఇండియా గేట్‌ ముందు, బీజేపీ ఆఫీస్‌ ముందు ఆ వడ్లన్నీ పారబోస్తానంటివి.. ఏమైంది.. నువ్వు ఇస్తానన్న బియ్యమే ఇంతవరకు ఇయ్యవైతివి..’అని సంజయ్‌ ధ్వజమెత్తారు. ‘యాసంగిలో తెలంగాణలో పండిన ప్రతి గింజ కొంటామని పోయినసారి పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌ ప్రకటించిన సంగతి కేసీఆర్‌కు గుర్తు లేదా’అని వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు