మేధావుల మౌనం రాష్ట్రానికి నష్టం: బండి 

27 Oct, 2021 02:57 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: మేధావుల మౌనం తెలంగాణకు నష్టమని, అంతా మేల్కొని ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన పుర ప్రముఖుల సమావేశానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. మేధావుల మౌనం కారణంగా తెలంగాణలోని అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. మేధావులు ఇకనైనా మేల్కొనాలని, కేసీఆర్‌ గడీల పాలనను బద్దలు కొట్టాలని, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తన రచనలతో ఉర్రూతలూగించిన గూడ అంజన్నను కడసారి చూడని వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు.

తెలంగాణ కోసం జీవితాంతం పనిచేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ను సైతం ఘోరంగా అవమానించాడన్నారు. కేసీఆర్‌ అంటే.. కల్వకుంట్ల కమీషన్ల రావు అని, కాళేశ్వరం పేరిట రూ.వేల కోట్లు దోచుకుంటున్నాడని ఆరోపించారు.  ఈ ఎన్నికల్లో ఈటల గెలుపు తథ్యమని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు