పోస్టులు భర్తీ చేయకుంటే మిలియన్‌ మార్చ్‌ 

26 Sep, 2021 01:40 IST|Sakshi
అంకిరెడ్డిపల్లిలో మాట్లాడుతున్న సంజయ్‌. చిత్రంలో విజయశాంతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

సిరిసిల్ల: దీపావళి పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వకుంటే మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీపావళి తరువాత నిర్వహించే మిలియన్‌మార్చ్‌ ఉద్యమంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, ఇదే చివరి ఉద్యమం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందన్నారు. కేసీఆర్‌ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారన్నారు. ఇక గల్ఫ్‌ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్‌ చెబుతున్నారని సంజయ్‌ ఆరోపించారు.

కాగా, గ్రామాల్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా అన్నారు. బండి సంజయ్‌ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన అంకిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు.  

అన్నీ ఆయన కుటుంబానికే...
తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్‌ కుటుంబానికే వచ్చాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఉపాధి కల్పించకుండా కేసీఆర్‌ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించి బీజేపీని గెలిపించాలని కోరారు.   

మరిన్ని వార్తలు