కేసీఆర్‌.. నీ అంతు చూస్తం

17 Apr, 2022 02:11 IST|Sakshi
పాదయాత్రలో మహిళతో మాట్లాడుతున్న బండి సంజయ్‌ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

ఖమ్మం, రామాయంపేట యువకుల ఆత్మహత్యలకు సీఎం, టీఆర్‌ఎస్‌ నేతలే కారణం 

ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. 

మూడో రోజు గద్వాల జిల్లాలో కొనసాగిన ప్రజా సంగ్రామ యాత్ర

అలంపూర్‌: సీఎం కేసీఆర్‌ అక్రమాలు, అవినీతిపై బీజేపీ ఉద్యమిస్తుంటే కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేయిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు. కేసులు పెట్టి జైలుకు పంపినా బెదిరేది లేదని, కేసీఆర్‌ అంతు చూస్తామని అన్నారు. ఖమ్మం, రామాయంపేట యువకుల ఆత్మహత్యలకు సీఎం, టీఆర్‌ఎస్‌ నేతలే కారణమని ఆరోపించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో ప్రజా సంగ్రామ యాత్ర శనివారం మూడో రోజు కొనసాగింది. కంచుపాడులో ప్రజలు, మహిళలను కలిసి వారి సమస్యలను సంజయ్‌ తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలకు టీఆర్‌ఎస్‌ తెర లేపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. మంత్రి అవినీతి, అక్రమాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఖమ్మం జిల్లా బీజేపీ కార్యకర్త సాయిగణేశ్‌పై 15 అక్రమ కేసులు పెట్టింది. అతను భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, అతని తల్లి స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ వేధింపులు భరించలేక చనిపోతున్నట్లు వీడియో పెట్టారు. లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ చావులకు ముమ్మాటికీ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలదే బాధ్యత’అన్నారు.

కేసీఆర్‌ వ్యాక్సిన్‌ అంతా.. తాగాలె ఊగాలె పండాలె 
ఈరోజు మనం మాస్కులు లేకుండా తిరుగుతున్నామంటే అది ప్రధాని మోదీ వల్లేనని సంజయ్‌ అన్నారు. మోదీ కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ వ్యాక్సిన్‌ అంతా ‘తాగాలె, ఊగాలె, పండాలె’ అని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో అకాల వర్షాలు, తెగులుతో పంట నష్టపోయి రైతులు అల్లాడుతుంటే సీఎం ఏనాడూ నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం కొనడం లేదంటూ రైతులు వరి వేయొద్దని చెప్పిన ఆయన తన ఫాంహౌస్‌లో అదే పంట ఎందుకు వేశారని ప్రశ్నిం చారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం తెలంగాణకు 1.40 లక్షల ఇళ్లు కేటాయించిందన్నారు. పేదలకు ఇళ్లు కట్టివ్వాలని చెబితే ఆ డబ్బును దారి మళ్లించారని ఆరోపించారు.  

వచ్చే నెల బిల్లు చూస్తే షాక్‌ కొడ్తది 
వచ్చే ఫస్ట్‌ నాడు చేతికొచ్చే బిల్లును చూస్తేనే షాక్‌ కొట్టే పరిస్థితి ఉంటుందని సంజయ్‌ అన్నారు. రాష్ట్రం ఇప్పటికే రూ.60 వేల కోట్ల బకాయిలు డిస్కంలకు బాకీ ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో అడ్డగోలుగా కరెంట్‌ వాడుతున్నారని.. అక్కడి వినియోగంతో ఐదారు గ్రామాలకు ఉచితంగా కరెంట్‌ సరఫరా చేయొచ్చని అన్నారు. పెట్రోలు ధరలు పెరుగుతున్నాయంటున్నారని.. కానీ కర్ణాటకలో లీటర్‌పై రూ.13 తక్కువగా ఉందని తెలిపారు. తెలంగాణలో లీటర్‌పై రూ. 30 తగ్గించడానికి అవకాశం ఉందన్నారు. పాదయాత్రలో శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు