ఎటు చూసినా అవినీతే: బండి 

23 Apr, 2022 05:00 IST|Sakshi

గద్వాల రూరల్‌/గట్టు: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెచ్చరిల్లాయని, ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక దందా, అత్యాచారాలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ఏ సంఘటన జరిగినా వాటి వెనకాల టీఆర్‌ఎస్‌ నాయకుల పేర్లే బయటకు వస్తున్నాయని ఆరోపించారు. పాలనాపరంగా కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తమ సర్కారు వచ్చిన వెంటనే అవినీతిపరుల భరతం పడుతుందని చెప్పారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 9వ రోజు శుక్రవారం గద్వాల మండలం శెట్టిఆత్మకూరు నుంచి సంజయ్‌ ప్రారంభించారు.

ధరూరు మండలంలోని పెద్దపాడు, చిన్నపాడు, చింతరేవుల, జూరాల డ్యాం మీదుగా కొనసాగిన పాదయాత్ర రాత్రి వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలం నందిమల్లకు చేరుకుంది. యాత్ర సాగిన గ్రామాల్లో ప్రజాసమస్యలను సంజయ్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వేరుశనగ పంటలు వేసిన రైతులు గిట్టుబాటు ధరలేక అవస్థలు పడుతున్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.
 

మరిన్ని వార్తలు