వీధిరౌడీలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం..

17 Aug, 2021 09:12 IST|Sakshi

ఎమ్మెల్యే మైనంపల్లి వ్యాఖ్యలపై బీజేపీ నిరసన 

వెంటనే అరెస్టు చేయాలంటూ

మైనంపల్లి దిష్టిబొమ్మల దహనం 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. దీనికి నిరసనగా ఎల్‌బీనగర్‌/మలక్‌పేట జోన్‌ పరిధిలోని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి దిష్టిబొమ్మలు దహనం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు.

సాక్షి, పహాడీషరీఫ్‌( హైదరాబాద్): టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వీధి రౌడీలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని బీజేపీ జల్‌పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు వివేకానంద (కపిల్‌)గౌడ్‌ అన్నారు. మైనంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీరాం కాలనీలో జల్‌పల్లి 16వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ బుడుమాల యాదగిరితో కలిసి సోమవారం దిష్టిబొమ్మను దహనం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీఆర్‌ఎస్‌ గుండాలు బీజేపీ కార్పొరేటర్‌పై దాడికి పాల్పడటం దారుణమన్నారు. దీనిపై బండి సంజయ్‌ స్పందిస్తే తట్టుకోలేని మైనంపల్లి చెప్పలేని భాషలో దూషణకు దిగడం సిగ్గుచేటన్నారు. వెంటనే మైనంపల్లిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 
► సైదాబాద్‌: మైనంపల్లిపై చర్యలు తీసుకునే వరకు భాగ్యనగర్‌ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని భాగ్యనగర్‌ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి అన్నారు. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
► టీఆర్‌ఎస్‌ నాయకులు గుండాయిజం చెలాయిస్తూ విపక్షపార్టీల ప్రజాప్రతినిధులపై దాడులు చేస్తుంటే పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని భాగ్యనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్‌రెడ్డి విమర్శించారు. 

 చంచల్‌గూడ: దమ్ము ఉంటే ఎమ్మెల్యే మైనంపల్లి పాతబస్తీకి రాస్తే తమ తడాఖా చూపిస్తామని బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు సహదేవ్‌యాదవ్‌ అన్నారు. బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌పై దాడి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచినందుకు అతను పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. 

ఎల్‌బీనగర్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాల్కాజ్‌గిరి బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌పై ఎమ్మెల్యే మైనంపల్లి అతడి అనుచరులు పోలీసుల సమక్షంలో దాడి చేయడంపై కార్పొరేటర్‌ మొద్దు లచ్చిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై అసభ్య పదజాలంతో దూషించిన మైనంపల్లి వెంటనే బహిరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌కేడీనగర్‌ చౌరస్తాలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు.

మరిన్ని వార్తలు