మోదీ అంటే కేసీఆర్‌కు వణుకు: సంజయ్‌ 

22 May, 2022 01:18 IST|Sakshi

26న ప్రధాని రాక సందర్భంగా అపూర్వ స్వాగతానికి ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రధాని నరేంద్ర మోదీ పేరు వింటేనే సీఎం కేసీఆర్‌ గజగజ వణికిపోతున్నారు. మోదీరాష్ట్రానికి వస్తున్నారని తెలిసి, మొఖం చెల్లక కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల సమతామూర్తి విగ్రహప్రతిష్టాపన సమయం లోనూ కేసీఆర్‌ ఇదేవిధంగా వ్యవహరించారని విమర్శించారు. ‘టీఆర్‌ఎస్‌ పాలనలో వేలాదిమంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులతోపాటు పలువురు ఇంటర్మీడియట్‌ విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు.

వారి కుటుంబాలకు ఏనాడూ నయాపైసా సాయం చేయని కేసీఆర్‌ ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్థిక సాయం చేస్తుం డటం సిగ్గుచేటు’అని మండిపడ్డారు. ఈ నెల 26న మోదీ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో పార్టీ తరఫున స్వాగతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి వరకు మోదీ వెళ్లే మార్గంలో వేలాదిమందితో అపూర్వస్వాగతం పలుకుదామన్నారు.

‘పెట్రో’ పన్నును రాష్ట్రమూ తగ్గించాలి 
వరుసగా రెండోసారి కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించకపోవడం దారుణమని సంజయ్‌ అన్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను రాష్ట్రం తగ్గించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.     

మరిన్ని వార్తలు