కేసీఆర్‌ను గద్దె దించేదాకా భాష మార్చుకోను: బండి 

29 Sep, 2021 02:09 IST|Sakshi
బెజ్జంకి మండలంలో జరిగిన పాదయాత్రలో రాజ్‌కుమార్‌ చౌహాన్, బండి సంజయ్‌

సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి పోయి చేసేదేమీ లేదు. ప్రధాని మోదీ వద్ద వంగివంగి దండాలు పెడుతడు. బయటకొచ్చి ఫోజులు కొడుతుండు. కేసీఆర్‌ను గద్దె దించే దాక నా భాష మార్చుకోను’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 32వ రోజు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లెపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా రైతులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బెజ్జంకి సభలో సంజయ్‌ మాట్లాడుతూ ధాన్యం కొనబోమని కేంద్రం, మోదీ ఏమైనా ఫోన్‌ చేసి చెప్పారా.. అని ప్రశ్నించారు. పండించిన ప్రతి గింజనూ కొంటామన్న కేసీఆర్‌ ఇప్పుడు నేపాన్ని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఎవరూ భయపడొద్దని, ప్రతి గింజనూ కేసీఆర్‌ చేత కొనిపిస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రభుత్వానికి బండి సంజయ్‌ అంబాసిడర్‌ అని కేటీఆర్‌ అంటున్నడు, అయితే, ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నేనే’అని అన్నారు. బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్‌ చౌహాన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇక్కడ బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఢిల్లీకి వెళ్లి వంగి వంగి కేసీఆర్‌ దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.  

కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, నేతలు తుల ఉమ, దూది శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా, హుజూ రాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో.. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్రను హుస్నాబాద్‌లో ముగించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ 2న హుస్నాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. దీనికి కేంద్రమంత్రి స్మృతీఇరాని, ఇతర ముఖ్యనేతలు హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు