సీఎం పీఠంకోసం కుమ్ములాట

27 Jun, 2022 02:17 IST|Sakshi
సామ వెంకట్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌పై బండి సంజయ్‌ విమర్శ 

సాక్షి, హైదరాబాద్‌/రసూల్‌పురా: టీఆర్‌ఎస్‌లో సీఎం పదవికోసం పార్టీ చీలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ‘పరిస్థితులను చూసి బెంబేలెత్తిన కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒక నెలైనా సీఎంగా చేయాలని ఆలోచిస్తున్నారు. కొడుకు కనీసం మాజీ సీఎం అని అయినా అనిపించుకోవాలని అనుకుంటున్నారు.

కూతురు కవిత కూడా పోటీకి వచ్చి నేను సీఎం కావొద్దా ? మాజీ సీఎం అనిపించుకోవద్దా అని అడుగుతున్నారు. ఇక ఇంతకాలం పార్టీకి సేవ చేశాను కదా! నేను కావొద్దా సీఎం.. అని మేనల్లుడు హరీశ్‌రావు కోరుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి’అని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం చైర్మన్‌ సామ వెంకటరెడ్డి, చందానగర్‌ మాజీ కార్పొరేటర్‌ నవతారెడ్డి, అఖిల భారత బంజారా సంఘం నాయకులు కృష్ణా నాయక్, మాలోతు చంద్రశేఖర్, సంగారెడ్డి మాజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ రాజా గౌడ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వర్‌రెడ్డి,

రాజగోపాల్‌ రెడ్డి సహా పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, బంజారా సంఘం నేతలు బీ జేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ ‘‘సీఎం కేసీఆర్‌ ఎప్పు డేం మాట్లాడతారో.. ఏ జీవో తీసుకొస్తారో ఎవరికీ తెలియదు. నిన్న టీచర్లు ఆస్తులు సమర్పించాలంటూ ఉత్తర్వులిచ్చారు.. బీజేపీ ఉద్యమించగానే భయపడి వెనక్కు తీసుకున్నారు’’అని అన్నారు.  

బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. 
రాష్ట్రంలో కల్వకుంట్ల అవినీతి పాలనను అంతం చేసేందుకు బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని బండి సంజయ్‌ ప్రజలను కోరారు. జూలై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరగనున్న పార్టీ బహిరంగ సభను పురస్కరించుకుని ఆదివారం జరిగిన భూమిపూజ కార్యక్రమంలో సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, ఏ సర్వే చేసినా టీఆర్‌ఎస్‌ పతనం ప్రారంభమైందనే నివేదికలు వస్తున్నాయని తెలిపారు. బీజేపీ నాయకులను అణచివేసేందుకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక విభా గం ఏర్పాటు చేశారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు