తెలంగాణ సొమ్ము పంజాబ్‌లో పంచుడేందీ? 

23 May, 2022 01:05 IST|Sakshi
గంభీరావుపేటలో మాట్లాడుతున్న బండి సంజయ్‌ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

ఉద్యోగులకు టైమ్‌కు జీతాలు ఉండవు.. రైతు రుణమాఫీ చేయవు 

ప్రధాని రాష్ట్రానికి వస్తే కలవాలనే సంస్కారం లేదు 

సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ ధ్వజం

సిరిసిల్ల: ‘తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును పంజాబ్‌లో పంచుడేందీ..? ఇక్కడ ఉద్యోగులకు టైమ్‌కు జీతాలు ఇవ్వవు. ముసలోళ్లకు పెన్షన్లు ఇవ్వవు. జీతాలు, పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి రాష్ట్రంలో ఉంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలపై రూ.లక్షలకోట్ల అప్పుల భారాన్ని మోపుతున్న కేసీఆర్‌కు జనం కష్టాలు అక్కర్లేదన్నారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయకుండా.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా.. ఆరోగ్యశ్రీకి పైసలు ఇవ్వకుండా.. కేసీఆర్‌ పంజాబ్‌కు వెళ్లి డబ్బులు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. ‘రైతులు వరి వేసుకుంటే.. ఉరే అన్నవు. ఇప్పుడు రైతులు వడ్లను తక్కువ ధరకు అమ్ముకున్నరు.

వడగళ్ల వానలతో నష్టపోయిండ్రు. వారిని ఆదుకోకుండా, పంజాబ్‌ రైతులకు సాయం చేయడమేంటి? ఛీ.. నీకంటే ఇంగిత జ్ఞానం లేని మనిషి ఇంకొకరు ఉండరు’అని మండిపడ్డారు. ‘చనిపోయిన నిరుద్యోగులు గుర్తుకు రావడం లేదు.. కొండగట్టు రోడ్డు ప్రమాద బాధితులనూ పరామర్శించలేదు.. ఆత్మహత్యలకు పాల్పడిన ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వలేదు.. నీవు తెచ్చిన 317 జీవోతో చనిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను పట్టించుకోలేదు.. కానీ.. పంజాబ్‌ రైతులు గుర్తుకు వచ్చారా..?

రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఢిల్లీకి.. నీ కొడుకు విదేశాలకు వెళ్లాడు. రాష్ట్రానికి ప్రధాని వస్తే.. మర్యాదపూర్వకంగా కలిసే సంస్కారం లేదు’అని ధ్వజమెత్తారు. ఈ నెల 25న కరీంనగర్‌లో హిందూ ఎక్తా యా త్రను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు