ఇద్దరు ముఖ్యమంత్రుల డ్రామా

9 Dec, 2022 04:32 IST|Sakshi
మొగిలిపేటలో మాట్లాడుతున్న బండి సంజయ్‌   

సజ్జల వ్యాఖ్యలపై బండి సంజయ్‌ ఆగ్రహం 

కవిత లిక్కర్‌ స్కామ్‌ పక్కకు పోయేందుకేనని మండిపాటు

24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా 

మల్లాపూర్‌ (కోరుట్ల):  కవిత లిక్కర్‌ స్కామ్‌ పక్కకు పోయేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంజయ్‌.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. కమీషన్ల ఒప్పందంతో స్కామ్‌లను పక్కకు తప్పించేందుకే రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తెలంగాణ సెంటిమెంట్‌ రగిల్చేందుకు కుట్ర 
లిక్కర్‌ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు ఇస్తే, తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని సంజయ్‌ ఆరోపించారు. రూ.లక్ష కోట్లు దోచుకుని లిక్కర్‌ దందా చేసి అడ్డంగా దొరికిన కేసీఆర్‌ బిడ్డ కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలని ప్రశ్నించారు. అవినీతిపరుల అంతుచూసేందుకు మోదీ సర్కారు చర్యలు ప్రారంభించిందని.. కేసీఆర్‌ను, ఆయన కొడుకు, బిడ్డను త్వరలోనే జైలుకు పంపుతామని వ్యాఖ్యానించారు. 

చట్టంలో విద్యుత్‌ మీటర్ల ఊసు లేదు.. 
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్‌.. ఎక్కడైనా అలా ఇస్తున్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సంజయ్‌ సవాల్‌ చేశారు. నిరూపించలేకపోతే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యమని, కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్ల ఊసు లేదని చెప్పారు. కేంద్రం మీటర్లు పెట్టకపోతే ప్రజలకు కేసీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

షుగర్‌ ఫ్యాక్టరీని కేంద్రానికి అప్పగించు 
రూ.లక్షల కోట్లతో దొంగ దందాలు చేస్తున్న కేసీఆర్‌ కుటుంబానికి ముత్యంపేట నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడం చేతకావడం లేదని సంజయ్‌ విమర్శించారు. ఫ్యాక్టరీ నడపడం చేతకాదని రాసిస్తే, కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్‌ దేవుళ్లకు కూడా శఠగోపం పెడుతున్నాడని అన్నారు.

‘వేములవాడ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు అన్నాడు.. ఒక్క పైసా ఇవ్వలేదు. బాసర ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయలని ఒక్క పైసా ఇవ్వలేదు. ఇప్పుడు కొండగట్టుకు రూ.100 కోట్లు అంటూ దేవుళ్లకే శఠగోపం పెడుతున్నాడు..’అని ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్ర గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని మొగిలిపేట నుంచి నడికుడ, రాఘవపేట, ముత్యంపేట గ్రామాల మీదుగా మెట్‌పల్లి మండలం వేంపేట వరకు సాగింది. 

మరిన్ని వార్తలు