ముగ్గురితోనే సర్కార్‌ను కూలుస్తమా? 

6 Dec, 2022 02:55 IST|Sakshi
మామడ సభలో మాట్లాడుతున్న  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌   

కేసీఆర్‌వి అర్థంపర్థం లేని మాటలు

‘డ్రగ్స్‌’ దందాతోనూ కల్వకుంట్ల కుటుంబానికి లింకు

హైదరాబాద్, బెంగళూర్‌ డ్రగ్స్‌ కేసులు రీ–ఓపెన్‌ చేయాల్సిందే..  

సీబీఐ విచారణకు పోతే అరెస్ట్‌ చేస్తారని కవితకు భయం 

కొండగట్టు మృతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

ప్రజాసంగ్రామయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

నిర్మల్‌: ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందట. కేసీఆర్‌.. ఎందుకు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతవ్‌. బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. నీ సర్కార్‌ను కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలె. అలాంటప్పుడు కూల్చడం ఎలా సాధ్యం? అయినా నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి? రాష్ట్ర ప్రజల ఆశలను కూల్చింది నువ్వే.

ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినవ్‌’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై బండి ఘాటుగా స్పందించారు.  ప్రజాసంగ్రామయాత్ర ఎనిమిదో రోజు సోమవారం నిర్మల్‌ రూరల్‌ మండలం రత్నాపూర్‌కాండ్లి నుంచి మామడ సాగింది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్, మామడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌ల్లో బండి మాట్లాడారు. 

ఆ మంత్రి అవినీతి చిట్టా ఉంది.. 
నిర్మల్‌ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాల చిట్టా తనవద్ద ఉందని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సంగతి చూస్తామని బండి హెచ్చరించారు. మంత్రిపైనా విచారణ జరపాల్సిందేనన్నారు. కాగా, ప్రజాసంగ్రామయాత్రలో స్వల్ప మార్పు చేసినట్లు పాదయాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 16న కరీంనగర్‌లో ఐదో విడత యాత్ర ముగుస్తుందన్నారు. అక్కడి ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని చెప్పారు. 

డ్రగ్స్‌దందాలో ఇంకొకరు.. 
ఇప్పటికే కేసీఆర్‌ బిడ్డ లిక్కర్‌ కేసులో దొరికారని, డ్రగ్స్‌ దందాలో కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బండి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, బెంగళూర్‌ డ్రగ్స్‌ కేసులను తక్షణమే రీ–ఓపెన్‌ చేసి, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఏ తప్పు చేయకపోతే 10 ఫోన్లను కవిత ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మద్యం అంటే ఇష్టమని, అందుకే కవిత మద్యం దందా చేసిందని ఎద్దేవా చేశారు.

ఈడీ, ఐటీ లాంటి సంస్థలు ఎక్కడ దాడులు చేసినా ఆమె పేరే బయటికి వస్తోందన్నారు. లక్ష కోట్ల లిక్కర్‌ దందా చేసిన కేసీఆర్‌ బిడ్డకు విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ అరెస్టయితే సానుభూతి పొందేందుకు తెలంగాణ సెంటిమెంట్‌ రగిలించే స్కెచ్‌ వేస్తున్నారని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు