ఇక్కడ వచ్చేది బీజేపీ ప్రభుత్వమే 

27 Jan, 2023 01:55 IST|Sakshi

ప్రజల ఆకాంక్షలకనుగుణంగానే మేనిఫెస్టో 

మహిళామోర్చా భేటీలో బండి సంజయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా నాలుగు గోడల మధ్య కూర్చుని మేనిఫెస్టోను రూపొందించడం లేదన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను స్వయంగా పరిశీలించి వారు ఏం కోరుకుంటున్నారో చేసిన అధ్యయనంతోనే పక్కాగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని చెప్పారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులతోపాటు వారి ఆర్ధిక, ఆరోగ్య పరిస్థితుల గురించి మహిళామోర్చా నాయకులు, కార్యకర్తలు అడిగి తెలుసుకోవాలని సూచించారు. గురువారం పార్టీ మహిళా విధానాలు, పరిశోధన విభాగం ఇంచార్జ్‌ కరుణా గోపాల్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, మహిళా మోర్చా నేతలతో సంజయ్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్రం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ఇక్కడ అందుతున్నాయా? లేదా? అసలు ఈ పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లండి’’అని పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని సస్పెండ్‌చేయాలి 
గవర్నర్‌ డా.తమిళి సై సౌందరరాజన్‌ను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి డిమాండ్‌ చేశారు.

గురువారం కరుణా గోపాల్, ఇతర నేతలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు మహిళలను అగౌరపరుస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి ఉదంతమే ఉదాహరణ అన్నారు. ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌కే భద్రత కరువైందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు