‘ముందస్తు’ ప్రచారం, కమలం అప్రమత్తం.. కేసీఆర్‌ అలా చెప్పారంటే ఏదో ఉన్నట్టే!

26 Nov, 2022 02:27 IST|Sakshi

ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని నిర్ణయం... 

బండి సంజయ్‌ పాదయాత్రతో పాటు బైక్‌ర్యాలీలు, ఇతరత్రా రూపాల్లో పార్టీ కార్యకలాపాలు వేగం

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగొచ్చుననే ప్రచారంతో కమలదళం అప్రమత్తమైంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కలిసొచ్చే ఏ అవకాశాన్నీ, అంశాన్నీ వదులుకోరాదనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో (మే లోగా) ఎన్నికలు ఉండొచ్చుననే ఊహాగానాల మధ్య ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని నిర్ణయించింది.

ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ విస్తృత సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.. కేసీఆర్‌ వెళ్లమని చెప్పారంటే అందుకు విరుద్ధంగానే చేస్తారని బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇతరనేతలు స్పందించారు. ఒకవేళ ఎన్నికలు అసెంబ్లీ నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే జరిగినా ఇంకా ఏడాది సమయమే ఉన్నందున ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమయ్యేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. 

119 సీట్ల పరిధిలోని అంశాలపై కసరత్తు... 
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ప్రధానపార్టీల వారీగా నేతలు, పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థుల బలాబలాలు, ఇతర అంశాలపై అధ్యయనం పూర్తిచేసినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్ల ఇతరపార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాలని నిర్ణయించింది.

నియోజకవర్గస్థాయి ప్రముఖులతో పాటు ఇతరపార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులపైనా ప్రత్యేక దృష్టి నిలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన రిజర్వ్‌డ్‌ ఎస్సీ–19, ఎస్టీ–12 సీట్లపైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో 50 శాతానికి పైగా వెనుకబడిన తరగతులు, ఓబీసీలకు చెందిన వారున్నందున, ఈ వర్గాలకు చెందిన మెజారిటీ ఓట్లను సాధించాలని భావిస్తోంది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో వివిధ కులాల వారీగా ఉన్న ఓటింగ్‌ శాతం ఆధారంగా ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వీరితో పాటు మొత్తం జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న మహిళలను ఆకర్షించేందుకు ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 

అటు పాదయాత్ర, ఇటు బైక్‌ ర్యాలీలు... 
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 17 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో బండిసంజయ్‌ పాదయాత్ర–5, ఈ నెల 26 నుంచి డిసెంబర్‌ 14 దాకా వివిధ లోక్‌సభ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’బైక్‌ర్యాలీలతో పాటు ఇతర రూపాల్లో పార్టీ కార్యాచరణను వేగం చేయాలని భావిస్తోంది. ఇక వివిధ రూపాల్లో రాష్ట్ర సర్కారు వైఫల్యాలు, హామీల అమల్లో వెనకడుగు, కుటుంబపాలన, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించారు. పోలింగ్‌బూత్‌ స్థాయి నుంచి 
టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలు ఎండగట్టడం ద్వారా రాష్ట్రంలో అన్నిస్థాయిల్లో పార్టీని పటిష్టం చేసే దిశలో చర్యలు 
చేపట్టనుంది.

అదే జోరు కొనసాగించేలా... 
దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించి... మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడినా టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్న చందంగా పట్టుదలతో పోరాడి మంచి మైలేజీని సాధించగలిగామని అంచనా వేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికలకు దూకుడుగా సిద్ధం కావాలని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చాటేందుకు రెడీ కావాలని నాయకత్వం నిర్ణయించింది. యువతలో బీజేపీ పట్ల మంచి స్పందన కనిపిస్తున్నందున పార్టీకి అనుకూలంగా సామాజిక మాధ్యమాలను మరింత ప్రభావపూరితంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు