సీఎంవో నుంచే విధ్వంస రచన.. బండి సంచలన వ్యాఖ్యలు

19 Jun, 2022 01:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం సీఎం కేసీఆర్‌ కార్యాలయం నుం చి వచ్చిన పక్కా పథకం ప్రకారమే జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసమే ఆందోళనకారులపై రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని ఆరోపించారు. కరీంనగర్‌లో ఉమ్మ డి జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇన్‌చార్జీలతో శనివారం బండి సంజయ్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ 30 శాతానికి పడిపోయిందని, ట్రిపుల్‌ ఐటీ, గౌరవెల్లి నిర్వాసితుల ఆందోళనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ‘అగ్నిపథ్‌’పేరుతో విధ్వంసానికి కేసీఆర్‌ కుట్ర చేశారని విమర్శించారు. రైల్వేస్టేషన్‌ విధ్వంసంపై ఇంటెలిజెన్స్‌కు ముందస్తు సమాచారం ఉందని ఆరోపించారు.

పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్‌ అంతిమ యాత్రలో టీఆర్‌ఎస్‌ నేతలు విధ్వంసం సృష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో సీఎం పదవిపై కలహాలు మొదలయ్యాయని, త్వరలోనే ఆ పార్టీ చీలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజ్‌భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ముందే హెచ్చరించినా.. వారిని ఆపలేదని, అదే బీజేపీ చిన్న ఆందోళనకు పిలుపునిచ్చినా..హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆందోళనకారుల వెనక ఉన్న దుండగులు పథకం ప్రకారమే రాళ్లు రువ్వి విధ్వంసానికి దిగారని, ఆర్మీ అభ్యర్థులు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.  

మరిన్ని వార్తలు