నన్ను ఆరు ముక్కలు చేసినా సరే..

12 Dec, 2022 03:25 IST|Sakshi
తులాభారంలో బండి సంజయ్‌ 

ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయండి 

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ డిమాండ్‌ 

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం

కోరుట్ల/కోరుట్ల రూరల్‌: ‘నన్ను ఆరు ముక్కలు చేస్తారట. నన్ను చంపినా సరే.. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ అమలు చేయాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్, మోహన్‌రావుపేటలో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండలో సంజయ్‌ మాట్లాడారు.

ప్రధాని మోదీ పేరుచెప్పి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 24 గంటల ఉచిత కరెంటు మాట ఉత్తదేనన్నారు. గల్ఫ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీడీ కార్మికుల సమస్యలు యధాతథంగా ఉన్నాయని, ఉద్యోగాలు, ఉపా«ధి లేక గల్ఫ్‌ వెళ్తున్న కుటుంబాలను ఆదుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీజేపీ అ«ధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యం, గల్ఫ్‌ కార్మికుల ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపిందని ధ్వజమెత్తారు. దేశంలో అత్యంత సంపన్న కుటుంబం కేసీఆర్‌దేనని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ దందాకే పరిమితం కాలేదని, పత్తాల ఆటలోనూ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఇంద్రభవనం తీరుగా ఉన్న కవిత ఇల్లు చూసి లిక్కర్‌ స్కామ్‌ విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులు కూడా విస్తుపోయారన్నారు. 50 గ్రామాలకు వాడాల్సిన కరెంటును కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు