సైబర్‌ నేరాల్లో టాప్‌ప్లేస్‌.. మానవ అక్రమ రవాణాలో కూడా..

30 Aug, 2022 01:49 IST|Sakshi

ఇదే కేసీఆర్‌ సాధించిన ఘనత: బండి సంజయ్‌ ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: ‘సీఎం కేసీఆర్‌ పెద్ద గజదొంగ.. ఆయన పాలనలో సైబర్‌ నేరాల్లో, మానవ అక్రమ రవాణాలో తెలంగాణను నంబర్‌ వన్‌గా మార్చారు. ఆర్థిక నేరా ల్లో నంబర్‌ 2గా, వృద్ధులపై దాడుల్లో నంబర్‌ 3గా, రైతు ఆత్మహత్యల్లో నంబర్‌ 4గా రాష్ట్రాన్ని మార్చారు. ఇదీ కేసీఆర్‌ సాధించిన ఘనత’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలను పిలిచి రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సమావేశానికి రాష్ట్రంలోని రైతు సంఘాలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన వాళ్లకు నయా పైసా ఇయ్యలే.. పంజాబ్‌ రైతులకు మాత్రం రూ. 3 లక్షలిచ్చిన విషయం కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదు’అని నిలదీశారు. సోమవారం రాత్రి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీల న్నీ ఎటుపోయినయ్‌ అని నిలదీశా రు.

‘కేసీఆర్‌.. నీకు చేతనైతే తెలంగాణ లో చేసిన అభివృద్ధి ఏంటీ? నువ్వు చేసిన అప్పులెన్ని? కేంద్రం ఇచ్చిన నిధులెన్ని లెక్కలు చెప్పు.. ఆ తరవాతే రాజకీయాలు మాట్లాడు. నువ్వు మోదీని తిట్టేంత గొప్పోడివా? ప్రపంచమంతా మోదీని పొగుడుతుంటే.. నువ్వు తిడతవా?’ అని మండిపడ్డారు. కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవం పేరు తో ప్రభుత్వ సొమ్ముతో సీఎం జిల్లాల్లో బహిరంగ సభలు పెడుతూ మోదీ, బీజేపీలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

‘మేం అభివృద్ధి గురించి మాట్లాడితే.. సీఎం కుటుంబం మతం గురించి మాట్లాడుతోంది.. ఏమైనా అంటే మోదీగారికి మీటర్‌ పెట్టాలని కేసీఆర్‌ అంటున్నరు.. నీకే తెలంగాణ ప్రజలు మీటర్‌ పెట్టబోతున్నరు బిడ్డా’అని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్‌స్కాంతో సంబంధం లేదని సీఎం కుటుంబీకులు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ‘మానవ అక్రమ రవాణా కేసీఆర్‌కు ఇష్టమైన వ్యాపారం. ఆయన పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌గా ఉంటూ చేసిన పని అదే’ అని ఆరోపించారు. ‘చెప్పు లు మోయడానికి.. తీసి ఇవ్వడానికి తేడా తెలియని మూర్ఖులు వాళ్లు.

నీ లెక్క తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జయశంకర్‌ లాంటివారిని కాలితో తన్నే రకం నేను కాదు. నీకు గురువు పట్ల కూడా సంస్కారం లేదు’అని అన్నారు. ‘పోలీసు బందోబస్తు లేకుండా కేసీఆర్‌ పాదయాత్ర చేస్తే.. నేను పాదయాత్ర బంద్‌ చేస్తా. 4వ విడత ప్రజాసంగ్రామ యాత్ర 12న ప్రారంభిస్తున్నా. కేసీఆర్‌ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తారో చెప్పాలి’అని సంజయ్‌ సవాల్‌ విసిరారు.     

మరిన్ని వార్తలు