BJP Chief Bandi Sanjay: అభివృద్ధికి నిధులివ్వవు, కోర్టుకెళ్తేనే నీళ్లిస్తావా? 

17 Sep, 2022 01:16 IST|Sakshi
కంటోన్మెంట్‌లో బండి సంజయ్‌ పాదయాత్ర   

సీఎం కేసీఆర్‌ను నిలదీసిన బండి సంజయ్‌ 

కంటోన్మెంట్‌ దత్తత హామీ ఏమైంది? 

ఈ ప్రాంతం రాష్ట్రంలో భాగం కాదా?  

ఆర్మీ ఇవ్వాల్సిన రూ.750 కోట్లు నేనే తెప్పిస్తానని వెల్లడి 

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ను దత్తత తీసుకుంటానన్న సీఎం కేసీఆర్‌.. కబ్జాలు సాధ్యం కావడం లేదనే గాలికొదిలేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్‌ అభివృద్ధి గురించి అడిగితే అది కేంద్ర పాలనలో ఉన్న ప్రాంతం అంటూ తప్పించుకుంటారని మండిపడ్డారు. అదే ఇక్కడి భూములు అవసరమైతే మాత్రం, కంటోన్మెంట్‌ రాష్ట్రంలో భాగమంటూ డబుల్‌ గేమ్‌ ఆడతాడని ఎద్దేవా చేశారు.

నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఐదో రోజు శుక్రవారం కంటోన్మెంట్‌లో సాగింది. అక్కడ ఏర్పాటుచేసిన సభలో బండి మాట్లాడారు. ‘కంటోన్మెంట్‌లోని స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వేలాది కుటుంబాలకు పట్టాలు ఇప్పించాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. భూబదలాయింపు కింద, ఆయా స్థలాలను కోరితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అయితే గత ఎనిమిదేళ్లలో కేసీఆర్‌ ఏనాడూ భూబదలాయింపు కోరలేదు’అని అన్నారు. కంటోన్మెంట్‌కు ఆర్మీ ఇవ్వాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విషయంలో కొంత అస్పష్టత ఉందని, తాజా లెక్కల ప్రకారం ఇవ్వాల్సిన రూ.750 కోట్లు తెప్పించే బాధ్యత తనదేనని బండి చెప్పారు. 

కంటోన్మెంట్‌ పాక్‌లో ఉందా? 
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉచిత మంచినీళ్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌లో ఇవ్వకుండా ఆలస్యం చేసిందని బండి చెప్పారు. బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ కోర్టుకు వెళ్లాకే ఇక్కడ కూడా ఉచిత నీళ్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. కంటోన్మెంట్‌ పాకిస్తాన్‌లో ఉందా లేదా, బంగ్లాదేశ్‌లో ఉందా లేక కేసీఆర్‌కు ఇష్టమైన చైనాలో ఉందా అని దుయ్యబట్టారు. మోదీని కలిసిన ప్రతిసారి వంగి వంగి దండాలు పెట్టడం తప్ప, ఇక్కడి సమస్యలేవీ కేసీఆర్‌ ప్రస్తావించరన్నారు. ప్రధాని మోదీ 18 గంటలు పనిచేస్తే.. కేసీఆర్‌18 గంటలు పడుకుంటారని ఎద్దేవా చేశారు.  

లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కూతురి పాత్ర 
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కూతురు ప్రమేయం ఉందన్న వీడియో బయటపడటంతోనే ఆయన అంబేడ్కర్‌ నామస్మరణ చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. అందుకే సచివాలయానికి అంబేడ్కర్‌ పేరంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటులో దళితుడిని కూర్చోబెట్టాలని సవాల్‌ విసిరారు.

సెప్టెంబర్‌ 17న పరేడ్‌ గ్రౌండ్‌లో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్న కేంద్రం ప్రకటనతోనే కేసీఆర్‌ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారన్నారు. కంటోన్మెంట్‌లో ఫ్లైఓవర్‌ల నిర్మాణానికి కేంద్రం స్థలాలు ఇవ్వడం లేదంటూ కేసీఆర్, ట్విట్టర్‌ టిల్లూ దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.  

మరిన్ని వార్తలు