శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి 

17 Nov, 2021 01:54 IST|Sakshi
మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న బీజేపీ నేతలు

బండి సంజయ్‌పై దాడులకు కేసీఆర్‌దే బాధ్యత.. గవర్నర్‌కు బీజేపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌కు మంగళవారం ఫిర్యాదు చేసింది. నల్లగొండ జిల్లా పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఆయన కాన్వా య్‌పై అధికార టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలోని కిరాయి మూకలు సోమవారం ఏడు పర్యాయాలు దాడికి పాల్పడ్డాయని గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చింది. ఈ దాడులకు బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని బీజేపీ భావిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది.

బీజేపీ నాయకుల పర్యటనలను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవాలని సీఎం బహిరంగంగా పిలుపునిచ్చారని, దానిని ఆ పార్టీ కార్యకర్తలు అమలు చేసి చూపారని తెలిపింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి హింసను ప్రేరేపించేలా మాట్లాడటం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటమేనని స్పష్టం చేసింది. హింసను నిరోధించే విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతల యంత్రాంగం కుప్పకూలే పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.

గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించినవారిలో పార్టీ నాయకులు డీకే ఆరుణ, డా.కె.లక్ష్మణ్, టి.రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, గరికపాటి మోహన్‌ రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, డా. జి.విజయరామారావు, పేరాల శేఖర్‌ రావు, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ ఉన్నారు. తాము సమర్పించిన వినతిపత్రంపై స్పందించిన గవర్నర్‌ ఆయా విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, చర్యలు తీసుకోవాలని సూచిస్తానని తెలిపినట్టు బీజేపీ నాయకులు వెల్లడించారు. 

టీఆర్‌ఎస్‌పై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ప్రతిపక్షాలపై హింసాత్మక దాడులకు ప్రేరేపిస్తున్న తీరుపై త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర బీజేపీ తీర్మానించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో బండి సంజయ్‌ బృందంపై సోమ, మంగళవారాల్లో కొనసాగిన దాడుల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట జనగామకు వెళ్లడం మంచిది కాదని, మళ్లీ దాడులు జరిగితే ఎవరు ఏ పార్టీ వారో పోల్చుకోవడం కష్టమని పోలీసులు గట్టిగా కోరడం తో సంజయ్‌ బృందం రాత్రికి హైదరాబాద్‌ చేరుకుంది.

బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించనున్నారు. 18న ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో పోటీ కార్యక్రమం ఏదైనా చేపట్టాలన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.   ‘రైతుల పక్షాన టీఆర్‌ఎస్‌ మూకలతో వీరోచిత పోరాటం చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు. పోలీసుల చాటున ఉండీ టీఆర్‌ఎస్‌ నాయకులు రాళ్లు రువ్వినా, దాడి చేసినా వెన్ను చూపని కార్యకర్తల ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్‌’అని బండి సంజయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు