కమలం పడిపోకుండా ‘చేయి’ అడ్డుపడింది

4 Nov, 2021 01:34 IST|Sakshi

ట్రిపుల్‌ ఆర్‌ అంటే చివరి ఆర్‌ రేవంత్‌ అన్నట్లుగా ఉంది  

ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను ఈటల రాజేందర్‌కు తాకట్టు పెట్టారని, కమలం కింద పడకుండా ‘చేయి’అడ్డం పడిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు భారతీయ జనతా కాంగ్రెస్‌లా మారి టీఆర్‌ఎస్‌ను ఓడించాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు జాతీయ స్థాయిలో శత్రువులుగా ఉంటూ హుజూరాబాద్‌లో మాత్రం మిత్రులుగా మారడం సిగ్గు చేటన్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు కృష్ణ మోహనరెడ్డి, క్రాంతి కిరణ్‌లతో కలిసి సుమన్‌ మీడియాతో మాట్లాడారు.

హుజూరాబాద్‌లో నైతిక విజయం టీఆర్‌ఎస్‌దే అన్నారు. ‘బండి సంజయ్‌ ట్రిపుల్‌ ఆర్‌ అంటే ఏమో అనుకున్నాం. రాజాసింగ్, రఘునందన్‌రావుతో పాటు మరో ఆర్‌ అంటే రేవంత్‌రెడ్డి అన్నట్లుగా ఉంది’అని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో అసెంబ్లీ పుట్టినప్పటి నుంచి ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు అత్యల్ప ఓట్లు వచ్చాయంటే ఈటల రేవంత్‌తో కుమ్మక్కయ్యారనే విషయం బయటపడిందని చెప్పారు. కొనడం, అమ్మడం, తాకట్టు పెట్టడం రేవంత్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు.

‘ఈటల గెలిచాక కూడా రొటీన్‌ డైలాగులు మాట్లాడటం కాదు. మోదీ కాళ్లు మొక్కి హుజూరాబాద్‌కు ఏం ప్యాకేజీ తీసుకొస్తారో చెప్పాలి’అని డిమాండ్‌ చేశారు. ఈటల ఏడుపు ముఖం పెట్టి ఓట్లు తెచ్చుకున్నారని, కాంగ్రెస్, బీజేపీల అనైతిక పొత్తును ప్రజలు గమనిస్తున్నారని సుమన్‌ వ్యాఖ్యానించారు. వాపును చూసి బీజేపీ గెలుపు అనుకుంటోందని, ఈటల తప్పులు చేసి టీఆర్‌ఎస్‌ను వీడారన్న విషయం మరిచిపోవద్దని అన్నారు.  

మరిన్ని వార్తలు