తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం: ‘కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం’

28 Feb, 2023 16:40 IST|Sakshi

ఢిల్లీ:  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఆ మేరకు ఇప్పట్నుంచి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఢిల్లీలో తెలంగాణ బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేతలు హాజరు కాగా, వారికి బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌చుగ్‌ మాట్లాడుతూ..  వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని తరుణ్‌ చుగ్‌ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించామని, బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు.


బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యం: బండి సంజయ్‌
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జనం భావిస్తున్నారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ‘రకరకాల కార్యక్రమాలతో  జనం లోకి వెళ్తున్నాం.స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు విజయవంతం అయ్యాయి. పార్టీ అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. 119 నియోజకవర్గాల్లో 119 సభలు నిర్వహిస్తాం.  ఆ తర్వాత 10 పెద్ద బహిరంగ సభలు పెడతాం. చివరికి ఒక మెగా బహిరంగ సభ ఉంటుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారు’ అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు