బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి: హరీశ్‌ 

4 Oct, 2021 02:12 IST|Sakshi
కమలాపూర్‌లో జరిగిన ధూంధాంకు హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న హరీశ్‌రావు  

హుజూరాబాద్‌లో మంత్రి సమక్షంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిక

కమలాపూర్‌లో ధూంధాం.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

హుజూరాబాద్‌/కమలాపూర్‌: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో పలువురు ఆ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘చేనేత కార్మికులు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పాలి. ఏడేళ్లలో నేత కార్మికులకు బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి’అని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికుల కోసం ఏ ఒక్క పథకమైనా ఆ పార్టీ తెచ్చిందా.. అని ప్రశ్నించారు.

ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డును బీజేపీ రద్దు చేయగా, నేతన్నకు టీఆర్‌ఎస్‌ చేయూతనందించిందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల నోట్లో మట్టికొట్టిన పార్టీకి ఓటేయ్యొద్దని సూచించారు. మూణ్ణెళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు ఆ పార్టీకి ఎలా కొమ్ముగాస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ ఉందని, గెల్లు శ్రీనివాస్‌ బ్రహ్మండంగా గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. బీజేపీ నాయకులు మోకాళ్ల మీద యాత్ర చేసినా ఈ విజయాన్ని ఆపలేరని ఎద్దేవా చేశారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ధూంధాం కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కమలాపూర్‌ గడ్డ.. టీఆర్‌ఎస్‌ అడ్డా అని, ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌లోకి రాకముందే ఇక్కడ గులాబీ జెండా ఎగిరిందని, ఆయన పార్టీని వీడిపోయిన తర్వాత కూడా ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతుందని అన్నారు. ఈటల తాను రాసుకున్న బురదను మనందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నాడని, తన బాధను మన బాధగా మార్చుకుని ఆగం కావద్దని, మనందరి బాధలు తీర్చే కేసీఆర్‌కు అండగా ఉండాలని హరీశ్‌రావు కోరారు. కాగా, ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దసంఖ్యలో వచ్చారు.   

గులాబీ గూటికి దాసరి భూమయ్య  
తీన్మార్‌ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్‌ సీఐ దాసరి భూమయ్య మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. రెండేళ్ల క్రితం పోలీసుశాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఆయన మొదటగా కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం తీన్మార్‌ మల్లన్న టీమ్‌లో సభ్యుడిగా పనిచేశారు. తాజాగా తీన్మార్‌ మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భూమయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. 

మరిన్ని వార్తలు