Motkupalli Narasimhulu: బీజేపీకి రాజీనామా

23 Jul, 2021 12:11 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. బీజేపీని వీడిన తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

చిచ్చుపెట్టిన దళిత సాధికారత పథకం
సీనియర్‌ నేత అయిన తనకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి.. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత పథకం సమావేశానికి హాజరవ్వడంతో వివాదం మరింత ముదిరింది. పార్టీ ఆదేశాలు కాదని మోత్కుపల్లి.. కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కావడం పట్ల బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత మోత్కుపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను దళిత ప్రజాప్రతినిధిగా బీజేపీ తరుఫున ఆ సమావేశానికి హాజరుకావడం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లయిందని అన్నారు. అంతేకాక దళిత సాధికారత పథకాన్ని, ముఖ్యమంత్రిని ప్రశంసించారు. దళితులకు మేలు జరుగుతుంటే ఆ వర్గానికి చెందిన నేతగా తాను వెళ్లకపోతే ఎలా అని పార్టీని నిలదీశారు. పైగా పార్టీ నాయకత్వానికి చెప్పే తాను వెళ్లానని... ఎక్కడా పార్టీ లైన్‌ను దాటలేదని తెలిపారు. అయితే మోత్కుపల్లి కేసీఆర్‌ను, ఆయన తీసుకొచ్చిన పథకాన్ని ప్రశంసించడం బీజేపీకి మింగుడుపడలేదు.

మరిన్ని వార్తలు